ఆల్కహాల్‌తో కరోనాకు చెక్: అమెరికా హాస్పిటల్ పేరుతో ప్రచారం.. నిజమా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 110 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. సుమారు లక్షా 20 వేల మందికి వైరస్ సోకింది. భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 73 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే వైరస్ వ్యాప్తి కంటే వేగంగా సోషల్ మీడియాలో వదంతులు హల్ చల్ చేస్తున్నాయి.

ఆల్కహాల్ తాగితే..

ఆల్కహాల్ తాగితే కరోనా రాదంటూ ఇటీవల ఓ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అమెరికాలోని కన్సాస్ సిటీకి చెందిన సెయింట్ లూక్స్ హాస్పిటల్ పరిశోధనలో ఈ విషయం తేలిందని ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. మార్చి 7న ఆ ప్రకటన వచ్చినట్లు కనిపిస్తున్న ప్రెస్ నోట్ ఇలా ఉంది. ‘ఆల్కహాల్ తాగితే కరోనా వచ్చే ముప్పు తగ్గుతుంది. లోతైన పరిశోధన తర్వాత ఈ విషయం తేల్చాం. లిక్కర్ డ్రింక్స్ అన్నింట్లోనూ వోడ్కా బెస్ట్. తాగడంతో పాటు క్లీనింగ్ కోసం శానిటైజర్ గా కూడా వాడుకోవచ్చు’ అని పేర్కొంటూ హాస్పిటల్ లోగోతో ఉంది ఆ నోట్.

 

అమెరికా హాస్పిటల్ ప్రకటన

ఆల్కహాల్ తాగితే కరోనా రాదంటూ సెయింట్ లూక్స్ హాస్పిటల్ పేరుతో జరుగుతున్న ప్రచారంపై దాని యాజమాన్యం స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఆ పోస్ట్ ఫేక్ అని గురువారం ప్రకటించింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్స్ (సీడీసీ) సూచించిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. అయితే చేతులు కడుక్కునేందుకు శానిటైజర్ గా ఆల్కహాల్ ఓకే అంటూ మరో ప్రచారం కూడా జరుగుతోంది. కానీ, శానిటైజర్ లో కనీసం 60 శాతం ఆల్కహల్ ఉండాలని సీడీసీ స్పష్టం చేసింది. అయితే వోడ్కాలోనూ 40 శాతమే ఆల్కహాల్ ఉంటుంది.

False reports are circulating that say drinking alcohol can reduce the risk of COVID-19. THIS IS NOT TRUE. Saint…

Posted by Saint Luke's Health System on Wednesday, March 11, 2020

సూచనలివే

  • కరోనా నియంత్రణకు ఉత్తమ మార్గం.. రోజులో చేతులను తరచూ శుభ్రం చేసుకోవడమే.
  • టాయిలెట్ కు వెళ్లిన తర్వాత, తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు, భోజనానికి ముందు కచ్చితంగా సబ్బు లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి.
  • కరోనా లక్షణాలతో ఉన్న వారికి దూరంగా ఉండాలి. అలా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు పబ్లిక్ ప్లేసుల్లో తిరగకూడదు.
  • తమ్ములు, దగ్గు వచ్చిన తర్వాత చేతులను కళ్లు, ముక్కు, నోటి దగ్గర పెట్టుకోకూడదు.
  • తరచూ తాకే వస్తువులను కూడా శానిటైజర్ లాంటి వాటితో క్లీన్ చేసుకోవాలి.

Latest Updates