పల్లె ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఓపెన్

వెలుగు నెట్‌‌వర్క్‌‌లాక్‌‌డౌన్‌‌ను సడలించడంతో పల్లెల్లో బతుకు సప్పుడు షురువైంది. చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు మొదలైనయి. మాస్కులు పెట్టుకొని, దూరం పాటిస్తూ కార్మికులు, కూలీలు పనికెక్కారు. కొన్ని చోట్ల మాత్రం కార్మికుల్లేక పనులింకా స్టార్టవలేదు. వలస కూలీలు సొంతూర్లకు పోవడంతో పని జేసెటోళ్లు దొర్కుతలేరు. కొందరు వ్యాపారులేమో ఫ్యాక్టరీలు తెరిచినా పబ్లిక్‌‌, గూడ్స్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ లేకుంటే పెద్దగా ఫాయిదా ఉండదని అంటున్నరు. బిజినెస్‌‌ ఊపందుకోదని చెబుతున్నరు.

కరోనా కట్టడిలో భాగంగా మే7 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌‌‌‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే రూరల్ ఏరియాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉండటంతో 38 రోజుల తర్వాత ఊర్లల్లోని16 రకాల ఫ్యాక్టరీల పనులు, వ్యాపారాలకు సర్కారు అనుమతిచ్చింది. గురువారం నుంచి తెరుచుకోవచ్చంటూ కలెక్టర్లకు బుధవారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. పని చేసే చోట కార్మికులు మాస్కులు పెట్టుకునేలా, సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. దీంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో స్టోన్ క్రషర్స్, ఇటుక బట్టీలు, సిరామిక్స్, టైల్స్, జిన్నింగ్ మిల్లులు, ఐరన్, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, పేపర్, రబ్బరు ఇండస్ట్రీలు తెరుచుకున్నాయి. భవన నిర్మాణాలు, ఇసుక తరలింపు, మైనింగ్ పని కూడా మొదలైంది. చేనేత, కాటన్ దుస్తుల తయారీ, బీడీ తయారీ యూనిట్లు, రిపేరింగ్ షాపులనూ ఓపెన్‌‌‌‌ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ కలెక్టర్ల అనుమతితో పరిశ్రమలు, షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సర్కారు చెప్పింది. కానీ ఎక్కడా తెరుచుకోలేదు. అర్బన్ ఏరియాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు.

పెద్ద ఇండస్ట్రీలూ మెల్లెగా..

జిల్లాల్లో చిన్న పరిశ్రమలతో పాటు పెద్ద ఇండస్ట్రీలూ తెరుచుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని కేశోరాం సిమెంట్ కంపెనీ 38 రోజుల తర్వాత ఓపెనైంది. సిమెంట్ తయారీకి కావాల్సిన ముడి సరుకు వచ్చినాకొద్దీ పూర్తిస్థాయిలో కార్మికులను పనిలోకి తీసుకుంటామని ఆఫీసర్లు చెప్పారు. ఈ జిల్లాలో పదుల సంఖ్యలో కంకర క్రషర్లు కూడా స్టార్టయ్యాయి. ఇక్కడి కనుకల చేనేత సహకార సంఘంలో కార్మికులు పనికి రావడంతో సాంచాల సప్పుడు మొదలైంది. టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ ఇండస్ట్రీకి కేంద్రమైన సిరిసిల్లలో శుక్రవారం నుంచి వస్త్ర పరిశ్రమ ప్రారంభమవబోతోంది. కరీంనగర్ సహా ఇంకిన్ని జిల్లాల్లో జిన్నింగ్ మిల్లులు మొదలవడంతో పత్తి కొనుగోళ్లు స్టార్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న గద్వాల జిల్లా మినహా ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో  చేనేత, బీడీ తయారీ యూనిట్లు తెరుచుకున్నాయి. ఒడిశా కార్మికులు అందుబాటులో ఉండటంతో దాదాపు అన్ని జిల్లాల్లోని ఇటుక బట్టీల్లో పనులు మొదలయ్యాయి. వెల్డింగ్ షాపులు, వివిధ రిపేరింగ్ సెంటర్లు తెరుచుకున్నా తొలి రోజు అంతంతే గిరాకీ ఉందని యజమానులు చెప్పారు.

కొరతంటూ రేట్లు పెంచేశారు

జిల్లాల్లో చాలా చోట్ల సిమెంట్ రేట్లు భగ్గుమంటున్నాయి. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌కు ముందు 50 కేజీల సిమెంట్ బ్యాగును రూ. 250 నుంచి రూ. 300 వరకు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు రేట్లు పెంచేశారు. కొరత ఉందంటూ ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గురువారం ఒక్కో బ్యాగును రూ. 500 వరకు అమ్మారు. దీంతో నిర్మాణదారులు కన్స్ట్రక్షన్ పనులకు ముందుకురావడం లేదు.

అనుమతులున్నా కూలీల్లేక..

రాష్ట్రవ్యాప్తంగా చాలా పరిశ్రమల్లో వలస కార్మికులే ఎక్కువగా పని చేస్తున్నారు. వాళ్లంతా సొంతూర్లకు పోవడంతో గురువారం చాలా ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. పోలేపల్లి సెజ్‌‌‌‌తో పాటు జడ్చర్ల దగ్గర్లోని చిన్న తరహా పరిశ్రమలు కార్మికుల్లేక నడపలేకపోతున్నామని యజమానులు చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని సిరామిక్స్ ఇండస్ట్రీదీ ఇదే పరిస్థితి. ఇక్కడ 20 సిరామిక్స్ పరిశ్రమలుండగా కార్మికుల్లేక తెరుచుకోలేదు. చాలా చోట్ల ముడిసరుకు సమస్య కూడా ఉంది. ఫ్యాక్టరీలు తెరిచినా పబ్లిక్, గూడ్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మొదలవకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదని ఫ్యాక్టరీల ఓనర్లు అంటున్నారు.

 

Latest Updates