భ‌ర్త‌కు ప్రాణపాయమ‌ని వివాహిత మెడ‌లో తాళి క‌ట్టిన న‌కిలీ జ్యోతిష్యుడు

హైద‌రాబాద్ : ప్రజల మూఢనమ్మకాలను అవ‌కాశంగా చేసుకొని.. నకిలీ జ్యోతిష్యులు ప‌లు అఘాయిత్యాల‌కు ఒడిగడుతున్నారు. కేపీహెచ్‌బీ కాల‌నీలో ఓ న‌కిలీ జ్యోతిషుడు.. వివాహిత‌ను న‌మ్మించి ఆమె మెడ‌లో తాళి కూడా కట్టి వేధింపుల‌కు గురిచేశాడు. ఈ విష‌యం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అత‌న్ని అరెస్ట్ చేశారు.

కోసూరి మాధవ్ అనే వ్య‌క్తి.. తాను జ్యోతిష్యుడిని అంటూ బాధితురాలికి పరిచయమయ్యాడు. ఆమె జాతకంలో దోషం ఉంద‌ని , దాని వ‌ల్ల ఆమెకు పక్షవాతం, ఆమె భర్తకు ప్రాణపాయం ఉందని నమ్మించాడు. భర్త లేని సమయంలో పూజ చేయాలంటూ, బాధితురాలికి మాయమాటలు చెప్పి.. ఆమె మెడలో తాళి కట్టాడు. తాళి కట్టాక ఆమె తన భార్యంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్‌ను బాధితురాలి ఫోన్‌కి నిందితుడు పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాధవ్‌ను, అతడికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు రిమాండుకు తరలించారు.