ఫేక్ ISI మార్క్ : ముఠా అరెస్ట్

హైదరాబాద్ : నకిలీ హెల్మెట్లు తయారు చేస్తూ.. మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న నకిలీ హెల్మెట్ల దందా గుట్టు రట్టు చేశామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గజియాబాద్ లో 8 నకిలీ హెల్మెట్ల కంపెనీలపై రైడ్స్ చేసి, దీరజ్ కుమార్, అనిల్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్.. నాసిరకంగా నకిలీ హెల్మెట్లు అమ్మకాలు చేసేవారిపై, డిస్ట్రిబ్యూషన్ చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తప్పవన్నారు. ముఠా సభ్యులపై 11 క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. రోడ్డు ప్రమాధాలలో హెల్మెట్లు ధరించకపోవడం,నాణ్యత లేని హెల్మెట్లు ధరించడంవల్లే జరుగుతున్నాయన్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలతోనే చనిపోయిన వారి సంఖ్యలు పెరుగుతునట్లు చెప్పారు.

గత సంవత్సరం ద్విచక్ర వాహనాలు నడుపుతూ.. 455 మంది రోడ్డు ప్రమాదాలతో మరణించారన్నారు. అందులో 375 మంది హెల్మెట్ ధరించక మరణించగా.. 80 మంది నకిలీ హెల్మెంట్ ధరించి రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయరన్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు నకిలీ హెల్మెట్ల తయారు కంపెనీలపై దృష్టి పెట్టారన్నారు. ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా నకిలీ హెల్మెట్ల తయారీని గుర్తించమన్నారు సైబరాబాద్ పోలీసులు. నకిలీ హెల్మెట్లపై ISI మార్క్ తో దందా కొనసాగుతుందన్నారు. నకిలీ హెల్మెట్ల తయారీ నాణ్యతలేని ప్లాస్టిక్, ఫైబర్, థర్మకోల్ తో నాణ్యత లేకుండా నాసిరకంగా హెల్మెట్లు తయారవుతున్నాయన్నారు. వాటి విలువ 100 నుండి 200 వరకు ఉంటుంది కానీ.. మార్కెట్ లో రూ. 500లకుపై విక్రయిస్తున్నారని చెప్పారు. నాణ్యతలేని హెల్మెట్లు కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ధరించకపోయినా, నాణ్యతలేని హెల్మెట్ ధరించిన వారిపై చట్ట ప్రకారం ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తారన్నారు.

Latest Updates