కొలువుల పేరుతో రూ. 3.57 కోట్ల వసూలు

fake-jobs-arrest-nizamabad-man

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్​ఇండియా ద్వారా పలు శాఖల్లో ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ. 3.57 కోట్లు వసూలు చేసిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… నిజామాబాద్​కు చెందిన కళ్యాణ్​తన స్నేహితుడైన తాహెర్​ పాషాతో కలిసి 2017లో  హైదరాబాద్​లోని వనస్తలిపురంలో ఫోర్​స్క్వేర్​ టెక్నో ప్రైవేట్​లిమిటెడ్​ప్రారంభించాడు. దానిద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ వసూళ్లు ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో కేంద్రప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన డిజిటల్​ ఇండియా ప్రాజెక్టును ఆయుధంగా మార్చుకున్నారు. దాని ద్వారా పోస్టాఫీసుల్లో కంప్యూటర్​ఆపరేటర్​  ఉద్యోగాలిప్పిస్తామని, అందుకోసం రూ. లక్ష ఇవ్వాలనే షరతుతో నిరుద్యోగులకు గాలం వేయడం ప్రారంభించారు. కాంట్రాక్టు ప్రాసెస్​ కింద ఉద్యోగాలు చేయాలనే మాయమాటలు చెప్పి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 3.57 కోట్లు వసూలు చేశారు. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశాఖ, అటవీశాఖలోనూ ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. ఈ మేరకు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్​నగర్​ పోలీస్​స్టేషన్​లలో పలుసార్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఆదిలాబాద్​ జిల్లాలోనూ గత సంవత్సరం అటవీశాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారు.

ఉమ్మడి జిల్లాలో ఏజెంట్లు

ఆదిలాబాద్​కు చెందిన సయీద్​అహ్మద్​ఏడాది క్రితం నిజామాబాద్​కు చెందిన తాహెర్​పాషా ద్వారా కళ్యాణ్​ను పరిచయం చేసుకున్నాడు. ఆదిలాబాద్​లో ఫోర్​స్వ్కైర్​ సంస్థ ద్వారా ఉద్యోగాలిప్పించే ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు అహ్మద్​ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ ప్రకటనలు చూసిన నిరుద్యోగులు అహ్మద్​ను కలిశారు. తమకు ఉద్యోగాలిప్పించాలని వేడుకోవడమే కాకుండా అడిగినంత డబ్బులిచ్చారు. తనవద్దకు వచ్చిన నిరుద్యోగుల నుంచి రూ. 3.57  కోట్లు వసూలు చేశాడు. అయితే ఆ డబ్బుల్లో నుంచి కేవలం రూ. 39 లక్షలు మాత్రమే కళ్యాణ్​కు ఇచ్చాడు. మిగతాదంతా తానే ఖర్చు చేసుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో 596 మంది ఇతడి బారిన పడి మోసపోయారు. బాధితులకు రోజుకో మాట చెబుతూ కాలం గడిపిన అహ్మద్​ వారి డబ్బులను రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడి పెట్టాడు. ఒక ఫంక్షన్​ హాల్​కూడా కట్టించుకున్నాడు. అహ్మద్​ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి పర్సంటేజీ వెంటనే ఇచ్చిన అహ్మద్​ఉద్యోగాలు చూపించకుండా చేతులెత్తేశాడు. డబ్బులిచ్చినవారంతా వెంటపడడంతో ప్రస్తుతం కొంతమంది ఏజెంట్లు పరారీలో ఉన్నట్లు తెలిసింది. కళ్యాణ్​, సయీద్​ అహ్మద్​ను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి బెంజ్, ఫోర్డ్​ఎకో కార్లు, రూ. 40 లక్షల విలువైన ఆఫీస్​ఫర్నీచర్​ స్వాధీనం
చేసుకున్నారు.

వీఆర్వో అరెస్టు

కరీంనగర్ క్రైం, వెలుగు : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన వీఆర్వోను పోలీసులు అరెస్టు చేశారు. మానకొండూర్ మండలం కొండపల్కాల గ్రామానికి చెందిన వేముగంటి నాగరాజు 2011 సంవత్సరంలో  వీఆర్వోగా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామంలో విధుల్లో చేరాడు. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామానికి బదిలీ అయ్యాడు. అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి తనిఖీ చేసినప్పుడు మద్యం మత్తులో విధులు నిర్వహిస్తుండడం చూసి సస్పెండ్ చేశారు. దీంతో చేతిలో డబ్బులు లేక మోసాలకు తెర తీశాడు. పరిచయస్తులకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాల ఆశ చూపాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉద్యోగాల కోసం ఒత్తిడి చేయడంతో అపాయింట్​మెంట్​లేఖలను సృష్టించి సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఇలా మోసపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నాగరాజును వలపన్ని పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ ఆర్డర్ కాపీలు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates