దొంగ పాస్ పోర్టులపై విచారణ జరిపించాలి

దొంగ పాస్ పోర్టులపై విచారణ జరిపించాలి

 లోక్ సభ జీరో అవర్​లో ఎంపీ అర్వింద్

నిజామాబాద్ లో బయటపడ్డ దొంగ పాస్ పోర్టుల అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఎంపీ అర్వింద్ కేంద్రాన్ని కోరారు.  దొంగ పాస్‌‌పోర్టులు అందుకున్న 72 మంది రోహింగ్యాల్లో 32 మంది బోధన్‌‌లోని ఒకే అడ్రస్ పాస్ట్ పోర్టు పొందారని చెప్పారు. సోమవారం లోక్ సభ జీరో అవర్ లో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దొంగ పాస్ట్ పోర్టులు పొందినవాళ్లు బెంగాల్‌‌లో ఆధార్‌‌ కార్డులు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణ లో తేలిందన్నారు. అయితే పాస్‌‌పోర్టు జారీ సమయంలో సంబంధిత పోలీసు అధికారులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదని ఆరోపించారు. అందులో కొందరికి ఓటర్‌‌ ఐడీ కార్డులు సైతం ఉన్నాయని మీడియాలో వచ్చిందని సభకు తెలిపారు. 46 మంది రోహింగ్యాలను ఈ నెల ప్రారంభంలో జమ్మూలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. వాళ్లు మయన్మార్, బంగ్లాదేశ్‌‌ మీదుగా దేశంలోకి వచ్చేందుకు హైదరాబాద్‌‌కు చెందిన ముగ్గురు ఎంఐఎం ఎమ్మెల్యేలు సహకరించారని చెప్పినట్టు తెలిపారు. దేశ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడిందని అర్వింద్‌‌ ఆరోపించారు. ఈ రోహింగ్యాలే భైంసాలో మతఘర్షణలకు కారణమైనప్పటికీ, రాష్ట్రప్రభుత్వం మాత్రం హిందువులను జైళ్లలో పెడుతోందని మండిపడ్డారు.