ఆర్టీఏల్లో దొంగ ఆర్సీలు

  • ఫైనాన్స్డ్ వాహనాల రిజిస్ట్రేషన్లలో కొత్త దందా
  • గుంజుకొచ్చిన బండ్లను వేలం వేయకుండా అమ్మకాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో కొత్త దందాకు తెరలేచింది. సరిగా లోన్ కట్టని వారి నుంచి గుం జుకొచ్చిన వాహనాలకు నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఒరిజినల్ ఆర్సీ కార్డులను దొంగతనంగా వాడేస్తున్నారు. తర్వాత బండ్లను అయినకాడికి  అమ్మేస్తున్నారు. ఇటు వాహనాల ఓనర్లకు, అటు సర్కారు ఆదాయానికి దెబ్బకొడుతున్నారు. బ్యాంకు/ఫైనాన్స్​ ఏజెంట్లు, ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కై దందా నడిపిస్తున్నట్టు సమాచారం.
రూల్స్ ఉన్నాయ్ ..
బ్యాంకు /ఫైనాన్స్ కంపెనీల రికవరీ ఏజెంట్లు వాహనాలను లాక్కెళ్లినా .. దానిని అంత ఈజీగా అమ్ముకోవడానికి వీలుండదు. ఎవరి పేరుమీదైనా ట్రాన్స్​ఫర్ చేయాలంటే.. సదరు బ్యాంకు/ఫైనాన్స్​ సంస్థ పేరు మీద ఎఫ్ ఆర్సీ (ఫ్రెష్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. లేదా సదరు వెహికిల్ ఓనర్ ఒరిజినల్ ఆర్సీని అందజేసి, సంతకం చేయాలి. కానీ బ్యాంకు /ఫైనాన్స్​ ఏజెంట్లు ఆర్టీఏ సిబ్బందితో కుమ్మక్కై అడ్డదారుల్లో అమ్ముతున్నారు. బ్యాంకు /ఫైనాన్స్​ సంస్థ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలతో కొత్త ఒరిజినల్ ఆర్సీ కార్డులను తయారు చేస్తున్నారు.
ఆర్టీఏ ఆఫీసుల్లోనే..
ఆర్టీఏ కమిషనర్‌‌ ఆఫీసు నుంచి ఆర్సీ కార్డులు బ్లాంక్‌ గా (ఎలాంటి వివరాలు లేకుండా) వస్తాయి.
వాటిని తయారు చేసిన సంవత్సరం, సీరియల్ నంబర్ ఓ వైపు ముద్రించి ఉంటాయి. స్థానిక ఆర్టీఏ
కార్యాలయంలో బండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆ వివరాలను ప్రింట్‌‌ చేసి, ఓనర్ కు ఇస్తారు. అలాంటి బ్లాంక్‌ కార్డులను బ్యాంకు /ఫైనాన్స్​ ఏజెంట్లు, ఆర్టీఏ సిబ్బంది అక్రమాలకు వాడుతున్నారు. గుంజుకొచ్చిన బండ్ల వివరాలను వాటిపై ముద్రించి, ఒరిజినల్‌‌ ఆర్సీగా వినియోగిస్తూ.. ఓనర్ షిప్ ను ట్రాన్స్‌‌ఫర్‌‌ చేయిస్తున్నారు.
అధికారిక అవకాశమున్నా..
వాస్తవానికి బండి లాక్కొచ్చిన తర్వాత ఓనర్‌‌ లేకున్నా కూడా ఫైనాన్సర్‌‌ ఎఫ్‌‌ఆర్సీ (ఫ్రెష్‌‌ రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్‌‌) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్‌ నంబర్‌‌ 36 దాఖలు చేయాలి. తర్వాత అధికారులు యజమానికి అడ్రస్ కు నోటీసులు పంపిస్తారు. వారి నుంచి స్పందన రాకపోతే బండికి మరో ఆర్సీ కార్డును ఫైనాన్సర్ పేరుమీద జారీ చేస్తారు. ఇలా ఎఫ్‌‌ఆర్సీకి వెళితే ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చు కూడా ఎక్కువ. దీంతో అక్రమ మార్గం పడుతున్నారు. దీనిపై
మరిన్ని సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. రికవరీ ఏజెంట్లు, ఫైనాన్స్ సంస్థల్లోని సిబ్బంది కుమ్మక్కై వాహనాలను అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఈ అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోం ది. రాష్ట్రంలో సుమారు రోజుకు 5 వేల వరకు వాహనాల (అన్ని రకాల వెహికిల్స్) ట్రాన్స్‌‌ఫర్లు జరుగుతున్నట్లు అంచనా. ఇందులో వందల సంఖ్యలో నకిలీ కార్డులు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇలా ఆర్సీ కార్డులు తయారు చేసి ఇచ్చినందుకు ఆర్టీఏ సిబ్బంది ఒక్కో కార్డుకు రూ. 500 నుం చి రూ. 1000 వరకు  తీసుకుంటున్నట్టు తెలిసిం ది. వాస్తవానికి ఎఫ్‌‌ఆర్‌‌సీ (ఫ్రెష్‌‌ రిజిస్ట్రేషన్‌‌ సర్టిఫికెట్‌‌) ప్రకారం వెళితే ఒక్కో కార్డుకు రూ.3 వేలకు పైనే ఖర్చవుతుంది. ఈ లెక్కన రోజూ వందల నకిలీ కార్డులతో ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం చేకూరుతోంది.
హైదరాబాద్‌‌లోనే ఎక్కువ!
నకిలీ ఆర్సీ కార్డుల తయారీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా.. హైదరాబాద్‌‌లోనే ఎక్కువగా జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఒక ఏరియాకు చెందిన కార్డులను వేరే ఏరియా ఆఫీసులలో తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో వెహికిల్ ఓనర్ షిప్ ట్రాన్స్​ఫర్ సందర్భంగా నకిలీ ఆర్సీ కార్డులను అధికారులు గుర్తించారు. ఓ ఆర్టీఏ
ఆఫీసులో 50, మరో రెండు చోట్ల పది చొప్పున రిజిస్ట్రేషన్లను హోల్డ్‌‌లో పెట్టారని సమాచారం.
వేలం వేయకుండానే..
బండి కొన్న వ్యక్తి సక్రమంగా వాయిదాలు కట్టకుంటే బ్యాంకు /ఫైనాన్స్‌‌ ఏజెంట్లు వెళ్లి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ బండ్లను కొంతకాలం గోడౌన్లలో పార్క్​ చేస్తారు. అప్పటికి ఓనర్లు స్పందించకుంటే వేలంలో అమ్మేస్తారు. ఈ సమయంలోబండి ఓనర్ కు నోటీసు పంపాల్సిందే. కానీ కొన్ని చోట్ల ఇది జరగడం లేదు. బ్యాంకు /ఫైనాన్స్​ సంస్థల వారే నేరుగా వేరే వారికి అమ్ముకుంటున్నారు. ఫైనాన్స్​ పై తీసుకున్న వాహనాలను తిరిగి రిజిస్ట్రేష న్ చేయాలన్నా, వేరేవారికి అమ్మాలన్నా ఆ సంస్థ నుంచి ఎన్‌‌వోసీ తప్పనిసరి. లోన్ మొత్తం చెల్లించాకే ఎన్వోసీ ఇస్తారు. కానీ ఇక్కడ బ్యాంకు /ఫైనాన్స్ వారే అమ్మేస్తుం డటంతో.. లోన్ పూర్తికాకున్నా ఎన్వోసీలు సంపాదిస్తున్నారని సమాచారం.

Latest Updates