టాస్క్​ఫోర్స్​ గెటప్ లో ఫేక్ పోలీస్

  • చేతిలో వాకీటాకీ,పోలీస్ సైరన్
  • పాతబస్తీ అడ్డా గా పోలీస్ ఉద్యోగాలంటూ చీటింగ్

హైదరాబాద్, వెలుగుపోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకి చిక్కాడు. పాతబస్తీ అడ్డాగా  అమాయకులను మోసం చేస్తున్న సూడో పోలీస్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి పోలీస్, ప్రెస్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పేరుతో ఉన్న ఫేక్​ఐడీకార్డులు, వాకీటాకీ, సెల్ ఫోన్ తో పాటు రూ.85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ, టాస్క్ ఫోర్స్ చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీ హుస్సేనీ ఆలమ్ కి చెందిన సయ్యద్ తన్వీర్ హుస్సేన్ రజ్వి(43) పదో తరగతి వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఇంజినీరింగ్ వర్క్ చేశాడు. తరువాత డ్రైవర్, సెక్యూరిటీ గా చేశాడు. 2014లో హోమ్ గార్డ్(డ్రైవర్) ఉద్యోగానికి అప్లై చేశాడు. సెలెక్ట్ కాకపోవడంతో అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్ చేస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు. సఫారీ డ్రెస్, చేతిలో వాకీటాకీతో హల్ చల్ చేసేవాడు. స్మార్ట్ ఫోన్ లో పోలీస్ రేడియో యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. వాకీటాకీలో పోలీస్ సైరన్ సౌండ్ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. తాను మఫ్టీలో తిరిగే పోలీసునని భార్యా పిల్లలను కూడా నమ్మించాడు.

సఫారీలో ఏఎస్​ఐ​గా..

అనుమానం రాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు ధరించే సఫారీలో తిరిగేవాడు. ఓల్డ్​సిటీలోని బస్తీల్లో టాస్క్ ఫోర్స్ లో ఏఎస్సైగా చెప్పుకునేవాడు. అలాగే ఉర్దు డైలీ జర్నలిస్ట్​గా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా కొంతకాలం సీసీఎస్ కానిస్టేబుల్ గా మరికొంత కాలం సెంట్రల్ జోన్ డీసీపీ ఆఫీస్ కి అటాచ్ అయ్యానంటూ నమ్మించేవాడు. డిపార్ట్ మెంట్ లో తనకు మంచి పరిచయాలు ఉన్నాయంటూ కానిస్టేబుల్, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను ట్రాప్ చేసేవాడు. విడతల వారిగా డబ్బులు వసూలు చేసేవాడు. పనిచేస్తున్నట్లు చెప్పుకునే ఆఫీస్ వద్దకు పిలిపించి అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు.

సీజ్ చేసిన వెహికల్స్ ఇప్పిస్తానంటూ..

అలాగే సీజ్ చేసిన వెహికిల్స్ ను వేలంలో తక్కువ ధరకు ఇప్పిస్తానని అమాయకులను నమ్మించాడు. కానిస్టేబుల్, హోంగార్డు జాబ్ కావాలనుకునేవారి వద్ద రూ.లక్ష నుంచి 3లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా పాతబస్తీ, రాజేంద్రనగర్, కంచన్ బాగ్ లోని ఐదుగురి వద్ద డబ్బు వసూలు చేశాడు. గోషామహల్ పోలీస్ స్టేడియంలోని సీజ్ చేసిన బైకులను తక్కువ ధరకే ఇప్పిస్తానని పాతబస్తీ యువకులను మోసం చేశాడు. తన్వీర్ ట్రాప్ లో పడి పదుల సంఖ్యలో అమాయకులు డబ్బులు ముట్టజెప్పారు. నిందితుడిపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తన్వీర్ పై నిఘా పెట్టారు. ఇన్ స్పెక్టర్ కె.మధుమోహన్ రెడ్డి టీమ్ బుధవారం తన్వీర్ ను అరెస్ట్ చేసింది. తదుపరి విచారణ కోసం హుస్సేనీ ఆలమ్ పోలీసులకు అప్పగించింది.

Latest Updates