చెవిలో బొద్దింక ఫ్యామిలీ

చెవిలోకి ఒక్క చిన్న చీమపోతేనే అల్లాడిపోతాం. మరి, ఓ పెద్ద బొద్దింక ఫ్యామిలీతో సహా మకాం వేస్తే ఎట్లుంటది? నొప్పితో విలవిల్లాడిపోవాలి. చైనాకు చెందిన 24 ఏళ్ల ఎల్​వీ అనే వ్యక్తికి అదే పరిస్థితి ఎదురైంది. రోజూ చెవిలో నొప్పి వస్తుండడంతో మామూలు నొప్పే అనుకున్నాడు. కానీ, ఒకరోజు పొద్దున్నే నిద్ర లేస్తుండడంతోనే ఆ నొప్పి ఎక్కువవడంతో ఇంట్లో వాళ్లను పిలిచి టార్చ్​ వేసి చూడమన్నాడు. ఇంకేముంది ఏదో పురుగు కనిపించింది. వెంటనే పక్కనే ఉన్న ఆస్పత్రికి పరుగు తీశాడు.

డాక్టర్​ స్కాన్​ చేసి బొద్దింక, దాని ఫ్యామిలీ ఉందని చెప్పాడు. వాటిని బయటకు తీశాడు. తల్లి బొద్దింకతో పాటు పది పిల్ల బొద్దింకలను బయటకు లాగేశాడు. అయితే, బెడ్డు పక్కనే మిగిలిన తిండిని వదిలేయడం వల్లే బొద్దింక చెవిలోపలికి వెళ్లి ఉంటుందని, అక్కడే గుడ్లు పెట్టి పిల్లలను చేసి ఉంటుందని అతడికి ట్రీట్​మెంట్​ చేసిన డాక్టర్​ చెప్పాడు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి సమస్యలు రావని అతడికి సూచించాడు. ఓ ఆయింట్​మెంట్, చుక్కల మందులు రాసి పంపించాడు.

ఇలాంటి ఘటనే పోయిన సంవత్సరం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. అక్కడ ఒకామె చెవిలో తొమ్మిది రోజుల పాటు బొద్దింక ఉందట. ఆమె డాక్టర్​ దగ్గరకు పోతే దానిని తీసేశాడట. కానీ, మళ్లీ నొప్పి వస్తే మరోసారి వేరే డాక్టర్​ దగ్గరకు ఆమె పోయిందట. స్కాన్​ చేసి చూస్తే చచ్చిపోయిన బొద్దింక కాళ్లు, దాని పాడైపోయిన శరీరం, మిగతా పార్టులు కనిపించాయట. వాటిని డాక్టర్​ తీసేశాడట.

Latest Updates