మహారాష్ట్ర రాజకీయాలు ఫ్యామిలీల చుట్టూనే..

మహారాష్ట్రలోని అన్ని పొలిటికల్​ పార్టీల లీడర్లూ తమ ప్రసంగాల్లో ‘రాష్ట్ర ప్రజలంతా (12 కోట్ల మందీ) మా కుటుంబ సభ్యులే’ అంటుంటారు. వాళ్లు అలా చెప్పటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో రాజకీయాలు ఎప్పుడూ కొన్ని ఫ్యామిలీస్​ చుట్టూనే తిరుగుతుంటాయి. కాబట్టి ‘కుటుంబం’ అనే మాటను పదే పదే పలకటం ఆ నేతలకు ఎంతో ఇష్టం. కొన్ని వంశాల్లో ఇప్పుడు నాలుగో తరం నాయకులు పాలిటిక్స్​ని శాసిస్తుండగా, కొన్ని కుటుంబాల్లో థర్డ్​ జనరేషన్​, మరికొన్నింటిలో రెండో తరంవాళ్లు చక్రం తిప్పుతున్నారు.

ఏ జిల్లాకు వెళ్లినా..

మహారాష్ట్రలో మొత్తం 36 జిల్లాలున్నాయి. ఏ జిల్లాకు వెళ్లినా వారసత్వ రాజకీయాలే కనిపిస్తాయి. స్థానికంగా ఉండే కొద్ది కుటుంబాలే యాక్టివ్​గా వ్యవహరిస్తుంటాయి. ఇది ఒకటో రెండో పార్టీలకు పరిమితం కాలేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు. కొందరు లీడర్లు రాష్ట్రవ్యాప్తంగానూ, మరికొందరు ప్రాంతాల వారీగానూ పాలిటిక్స్​ని ప్రభావితం చేస్తున్నారు. చాలామంది నాయకులు సొంత పలుకుబడి సాధించి జనానికి దగ్గరవుతున్నారు. కొంతమంది మాత్రం తమ ఫ్యామిలీ పేరో, ఇంటి పేరో చెప్పుకొని పైకొస్తున్నారు.

‘రాజ’ కుటుంబాలు..

ఈ ఫ్యామిలీలతోపాటు మరికొన్ని కుటుంబాలుకూడా వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శివాజీ వారసత్వంగల ఛత్రపతీలు ముందంజలో ఉన్నారు. వారిలో ప్రధానంగా రెండు రాయల్​ ఫ్యామిలీలు ఉన్నాయి. ఒకటి.. సతారా. రెండు.. కొల్హాపూర్. వీటికితోడు ఫల్తాన్​ రాజ కుటుంబీకులూ పాలిటిక్స్​లో పవర్​ చూపిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్​(సతారా) వంశంలోని 13వ తరానికి చెందినవాడైన ఛత్రపతి ఉదయన్​రాజే భోసలే ఎన్​సీపీ ఎంపీగా ఉన్నారు. ఇదే ఫ్యామిలీలోని శివేంద్ర రాజే భోసలే ఎమ్మెల్సీగా, ఛత్రపతి శంభాజీ రాజే (కొల్హాపూర్​) ఎంపీగా, ఛత్రపతి శివాజీ మొదటి భార్య రాణీ సయీబాయ్​ నింబాల్కర్​ వారసత్వంగల రామ్​రాజే నాయక్​ నింబాల్కర్​ మహారాష్ట్ర లెజిస్లేటివ్​ కౌన్సిల్​ చైర్మన్​గా ఉన్నారు.

అంబేద్కర్​ ఫ్యామిలీ.. 

రాజ్యాంగ నిర్మాత బీఆర్​ అంబేద్కర్​ కుటుంబీకుల్లోనూ ఫేమస్​ పొలిటీషియన్లు ఉన్నారు. అంబేద్కర్ కొడుకు యశ్వంత్​ గతంలో ఎమ్మెల్సీగా చేశారు. ఆయన కొడుకు ప్రకాశ్​ అంబేద్కర్​ మాజీ ఎంపీ కాగా, మరో కొడుకు ఆనంద్​రాజ్​.. రిపబ్లికన్​ సేన ప్రెసిడెంట్​గా ఉన్నారు. అంబేద్కర్​ ఫ్యామిలీకి అల్లుడైన సివిల్​ రైట్స్​ యాక్టివిస్ట్​ ప్రొఫెసర్​ ఆనంద్​ తెల్​తుంబ్డే.. రెండున్నరేళ్ల కిందట కొరెగావ్​–భీమా అల్లర్లతో సంబంధం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ అవటం సంచలనం సృష్టించింది.

సంగ్లీలో పాటిల్​ ఫ్యామిలీ

సంగ్లీ ప్రాంతం నుంచి పాటిల్​ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ కుటుంబం నుంచి చాలామంది లీడర్లు ఎదిగారు.  ఇందిరా గాంధీ బతికున్న రోజుల్లో వసంతదాదా పాటిల్​ ఫ్యామిలీకి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగుండేది కాదు. పాటిల్ మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.​ ఆయన రెండో భార్య శాలినీ తాయ్ పాటిల్ 80ల్లో లోక్​సభకు సంగ్లీ నుంచి ఎన్నికయ్యారు​. ఆ తర్వాత కోరేగావ్​, సతారాల నుంచి అసెంబ్లీకి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. వసంతదాదా కొడుకు ప్రకాశ్​ బాపు పాటిల్​ 1984, 89, 91, 99, 2001ల్లో సంగ్లీ నుంచి లోక్​సభకు గెలిచారు. ఆయన మరణంతో పెద్ద కొడుకు ప్రతీక్​ పాటిల్​ అదే స్థానంలో ఎంపీగా గెలిచి, మన్మోహన్​ కేబినెట్​లో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.  చిన్న కొడుకు విశాల్ పాటిల్​​ ప్రస్తుతం ‘షేట్కారి స్వాభిమాన్​ సంఘటన్​’ తరఫున శాసన సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

ఇదే ఫ్యామిలీలోని మరో శాఖ రావుసాహెబ్​ రామారావు (ఆర్​.ఆర్​.) పాటిల్ కుటుంబం. ఆయన ఎన్​సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా చేశారు. పాటిల్​ 2015లో చనిపోవడంతో భార్య సుమన్​ టాస్గావ్​ నుంచి బైఎలక్షన్​లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్ద కూతురు స్మిత యూత్​ యాక్టివిస్ట్​గా చురుగ్గా ఉన్నారు.పాటిల్​ ఫ్యామిలీకే చెందిన విజయ్​ సింహ్​ మొహితె–పాటిల్​… శరద్​ పవార్​కి అత్యంత నమ్మకస్తుడు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన కొడుకు రంజిత్​ సింగ్​ గతంలో ఒకసారి రాజ్యసభకు, మరోసారి లోక్​సభకు ప్రాతినిధ్యం వహించారు. రీసెంట్​గా బీజేపీలో చేరారు.

ముండే, మహాజన్​ల వారసులు

బీజేపీ ట్రబుల్​ షూటర్లుగా పేరుబడ్డ గోపీనాథ్​ ముండే, ప్రమోద్​ మహాజన్​ల వారసులు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూకూడా చురుగ్గా ఉన్నారు. ప్రమోద్​ మహాజన్​ గతంలో లోక్​సభ, రాజ్యసభల్లో సభ్యుడిగా ఉన్నారు. వాజ్​పేయి కేబినెట్​లో రక్షణ, పార్లమెంటరీ అఫైర్స్​, కమ్యూనికేషన్స్​ అండ్​ ఐటి శాఖలు నిర్వహించారు.మహాజన్​ హత్యకు గురి కావడంతో, ఆయన కుమార్తె పూనమ్​ మహాజన్ రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా, పార్టీలో ఆమెను బాగా ఎంకరేజ్​ చేశారు.కాంగ్రెస్​కి గట్టి సీటయిన ముంబై నార్త్​ సెంట్రల్​ నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా లోక్​సభకు ఎన్నికయ్యారు.

మహాజన్​ సోదరి ప్రద్న్యను గోపీనాథ్​ ముండే పెళ్లాడారు. ముండే రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా పనిచేసి, ఆ తర్వాత బీడ్​  సీటు నుంచి 2009, 2014ల్లో లోక్​సభకు ఎన్నికయ్యారు. మోడీ కేబినెట్​లో పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉంటూ, రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయనకు ముగ్గురూ కూతుళ్లే. బై ఎలక్షన్​లోనూ, 2019 ఎన్నికల్లోనూ ముండే కూతురు ప్రీతం బీడ్​ నుంచి ఎన్నికయ్యారు. మరో కూతురు పంకజ ముండే పాల్వే మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. పర్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఫడ్నవీస్​ కేబినెట్​లో గ్రామీణ, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నారు. ముండే సోదరుడి కొడుకు ధనంజయ్​ ముండే ఎన్సీపీలో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర లెజిస్లేటివ్​ కౌన్సిల్​లో అపొజిషన్​ లీడర్​గా వ్యవహరిస్తున్నారు.

నాందేడ్​లో చవాన్​ల వేదం

నాందేడ్​ ఏరియాలో చవాన్​లు చెప్పిందే వేదం. ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు మహారాష్ట్రకు సీఎంలుగా పనిచేశారు. శంకర్​రావు చవాన్ (1975–77, 86–88) రెండు సార్లు, అశోక్​ చవాన్ (2008–2010),​ పృథ్వీరాజ్​ చవాన్​ (2010–14) ఒక్కొక్కసారి సీఎం పదవిని చేపట్టారు. ఎస్​.బి.చవాన్​ కేంద్రంలో హోం, ఫైనాన్స్​ వంటి కీలక పదవులు చేపట్టారు. చవాన్​ కుటుంబానికి చెందిన మరో నాయకుడు దాజిసాహెబ్​ చవాన్​. ఆయన 16 ఏళ్లపాటు ఎంపీగా ఎన్నికై, కేంద్ర కేబినెట్​లో రక్షణ శాఖకు డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. దాజీసాహెబ్​ భార్య ప్రేమలతకూడా ఎంపీగా గెలిచారు. వీరి కొడుకే పృథ్వీరాజ్​ చవాన్​.

ఠాక్రే కుటుంబం నుండి మరో ఇద్దరు

ఠాక్రే కుటుంబంలో మరో ఇద్దరు రమేశ్​ ఠాక్రే, షాలినీ ఠాక్రే కూడా పాలిటిక్స్​లో చురుకు​గా ఉన్నారు. రమేశ్​ ఠాక్రే.. బాల్​ ఠాక్రే రెండో తమ్ముడు కాగా,  షాలినీ ఠాక్రే.. ఎంఎన్​ఎస్​ చీఫ్​ రాజ్​ ఠాక్రే కజిన్​ జితేంద్ర భార్య. ప్రస్తుతం ఎంఎన్​ఎస్​ జనరల్​ సెక్రెటరీగా ఉన్నారు. ఠాక్రే ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మొదటి మహిళ షాలిని.  ​

బీజేపీ..

రాష్ట్రంలో బీజేపీ–శివసేన కూటమి పవర్​లో ఉంది. బీజేపీ నేత​ దేవేంద్ర ఫడ్నవీస్ 44 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. శరద్​ పవార్​ తర్వాత చిన్న వయసులోనే సీఎం సీటులో కూర్చున్న ఘనత దేవేంద్రదే. ఆయనెవరో కాదు… జన సంఘ్ సీనియర్ లీడర్​ గంగాధర్​రావ్​ ఫడ్నవీస్​ కొడుకు.  దేవేంద్ర దగ్గర బంధువు శోభా ఫడ్నవీస్​ కూడా ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో..

మహారాష్ట్రలో ఎక్కువ కాలం కాంగ్రెస్​ పార్టీనే పవర్​లో ఉంది. అందులో మెజారిటీగా విఖే–పాటిల్​ ఫ్యామిలీ డామినేషన్​ ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబంలోని నాలుగో తరం హవా నడుస్తోంది. అహ్మద్​నగర్ జిల్లా​కు చెందిన ఈ ఫ్యామిలీకి గొప్ప చరిత్రే ఉంది. ఆసియాలో తొలిసారిగా కో–ఆపరేటివ్​ షుగర్​ ఫ్యాక్టరీ పెట్టిన కుటుంబం అది. విఠల్​రావ్​ విఖే–పాటిల్ నెలకొల్పారు. ఆయన కొడుకు ఏక్​నాథ్​ ​రావ్​ అలియాస్​ బాలాసాహెబ్​ విఖే–పాటిల్​ ఏడుసార్లు కోపర్​గావ్​ నియోజకవర్గం నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. ఆయన ఆరుసార్లు కాంగ్రెస్​ తరఫున, ఒకే ఒక్కసారి శివసేన టికెట్​తోనూ పోటీ చేసి గెలిచారు. వాజ్​పేయి మినిస్ట్రీలో ఫైనాన్స్​ సహాయ మంత్రిగా, భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004లో మరలా కాంగ్రెస్​ పార్టీలోకి ప్రవేశించి, ఎంపీగా గెలిచారు. కాగా, బాలా సాహెబ్​కు​ ముగ్గురు కుమారులు (రాధాకృష్ణ, రాజేంద్ర, అశోక్) ఉన్నారు.​ వీరిలో రాధాకృష్ణ ఒక్కరే రాష్ట్ర రాజకీయాల్లో పవర్​ఫుల్​గా కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఈ ఏడాది జూలైలో బీజేపీలో చేరి ఫడ్నవీస్​ కేబినెట్​లో మంత్రి పదవి దక్కించుకున్నారు. రాధాకృష్ణ కొడుకు సుజయ్​ ఇప్పుడిప్పుడే పాలిటిక్స్​లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అశోక్​ కూతురు నీలా విఖే–పాటిల్​ స్వీడన్​ ప్రధానమంత్రి స్టీఫెన్​ లాఫ్​వెన్​కి పొలిటికల్​ అడ్వైజర్​గా ఉన్నారు.

శివసేన..

బీజేపీ మిత్రపక్షం శివసేనకి బాల్ ​ఠాక్రే ఫౌండర్.  ఆ పార్టీ ఇప్పుడు ఠాక్రే ఫ్యామిలీలోని రెండో తరం చేతుల్లో ఉంది. బాల్ ​ఠాక్రే కొడుకు ఉద్ధవ్​ ఠాక్రే ప్రస్తుతం శివసేన చీఫ్​గా ఉన్నారు​. ఉద్ధవ్​ కొడుకు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. పార్టీ పగ్గాలు భవిష్యత్​లో ఆదిత్య చేపట్టే ఛాన్స్​ ఉంది.

నవనిర్మాణ సేన

బాల్ ​ఠాక్రే చిన్న తమ్ముడి (శ్రీకాంత్​ ఠాక్రే) కొడుకైన రాజ్​ఠాక్రే.. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్​ఎస్) నడుపుతున్నారు.  రాజ్​ని ఒకప్పుడు బాల్​ ఠాక్రే వారసుడిగా శివసైనికులు భావించేవారు. అయితే, ఉద్ధవ్​ ఠాక్రే ప్రవేశంతో రాజ్​ ఎంఎన్​ఎస్​ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. రాజ్​ఠాక్రే కొడుకు అమిత్​ ఠాక్రే తండ్రి బాటలోనే పయనిస్తున్నారు.

దేవ్రా (కాంగ్రెస్)

ముంబైకి చెందిన మురళీ దేవ్​రా మాజీ కేంద్ర మంత్రి. ఆయన కుమారుడు మిలింద్​ దేవ్​రా మాజీ కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ. ప్రస్తుతం ముంబై కాంగ్రెస్​ ప్రెసిడెంట్​. రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడు.  ఏఐసీసీ ప్రెసిడెంట్​ పదవికి రాహుల్​ గాంధీ రాజీనామా చేసిన సమయంలో  పార్టీ చీఫ్​ పోస్టుకు మిలింద్​ పేరు తెరపైకి వచ్చింది.

దేశ్ముఖ్ (కాంగ్రెస్)

లాతూర్​ ప్రాంతం దేశ్​ముఖ్​ల ఫ్యామిలీ పాలిటిక్స్​కి కేంద్రంగా ఉంటోంది. గతంలో విలాస్​రావ్​ దేశ్​ముఖ్​  ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కొడుకు అమిత్​ దేశ్​ముఖ్ ఏఐసీసీ సెక్రెటరీగా వ్యవహరించారు. విలాస్​రావ్​ చిన్న తమ్ముడు దిలీప్​రావ్​ ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరు మహారాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్​గా ఉన్నారు.

షిండే (కాంగ్రెస్)

షోలాపూర్​కి చెందిన మాజీ​ పోలీస్​ అధికారి.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్​లో కీలక బాధ్యతలు వహించారు. 2003–04 మధ్య మహారాష్ట్ర సీఎంగా, ఆ తర్వాత ఉమ్మడి ఏపీ గవర్నర్​గా, మన్మోహన్ కేబినెట్​లో పవర్, హోం శాఖల మంత్రిగా పనిచేశారు. షిండే పెద్ద కూతురు ప్రీతి షిండే ప్రస్తుతం షోలాపూర్​ సిటీ సెంట్రల్​ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

అంతూలే (కాంగ్రెస్)

రాయ్​గఢ్​ ఏరియాలో బలమైన నేత అబ్దుల్​ రెహ్మాన్​ అంతూలే. రాష్ట్రానికి తొలి ముస్లిం ముఖ్యమంత్రిగా ఆయన రికార్డ్​ సృష్టించారు. కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని కొడుకు నవేద్, అల్లుడు ముస్తాక్​ కొనసాగిస్తున్నారు. అల్లుడు కాంగ్రెస్​లోనే కంటిన్యూ అవుతుంటే, కొడుకు నవేద్​ మాత్రం శివసేనలో ఉన్నారు.

రాణే (ఎంఎస్పీ)

మహారాష్ట్రలోని సింధుదుర్గ్​ ప్రాంతంలో నారాయణ రాణే పేరున్న నేత​. శివసేన తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. ఈమధ్యనే మహారాష్ట్ర స్వాభిమాన్​ పార్టీ పెట్టారు. నారాయణ రాణే కొడుకు నితేశ్ కాంకావ్లి నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, మరో కొడుకు నీలేశ్ రాణే రత్నగిరి–సింధుదుర్గ్​ నుంచి 2009లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

భుజ్బల్ (ఎన్సీపీ)

నాసిక్​లో భుజ్​బల్​ కుటుంబం పాలిటిక్స్​ని ప్రభావితం చేస్తోంది. ఛగన్​ భుజ్​బల్​ ఎన్​సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా చేశారు. ఆయన బలహీన వర్గాల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కొడుకు పంకజ్​ ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే కుటుంబానికి చెందిన సమీర్​ మగన్​ భుజ్​బల్​ గతంలో లోక్​సభకు ఎన్నికయ్యారు.

సునీల్ దత్నర్గీస్ ఫ్యామిలీ

పాపులర్​ బాలీవుడ్​ యాక్టర్​ సునీల్​దత్ కుటుంబం ముంబై మహా నగరం వరకే పరిమితమై పనిచేస్తోంది. 1984 నుంచి 2005 వరకు అయిదుసార్లు వాయవ్య ముంబై నియోజకవర్గం నుంచి  సునీల్​ దత్​ లోక్​సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన భార్య, ప్రఖ్యాత నటి నర్గీస్​ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.  సునీల్​ దత్ కేంద్ర మంత్రిగా ఉంటూ చనిపోవడంతో బై ఎలక్షన్​లో ఆయన కూతురు ప్రియా దత్​ ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో ముంబై నార్త్​ వెస్ట్​ పేరు ముంబై నార్త్​ సెంట్రల్​గా మారింది. 2009లో రెండోసారి ప్రియా దత్​ నెగ్గారు. ఆ తర్వాత రెండుసార్లు వరుసగా ఓడిపోయారు.

సునీల్​ దత్​–నర్గీస్​ల ఒక్కగానొక్క కొడుకు సంజయ్​ దత్​. తల్లిదండ్రుల సినీ వారసుడిగా సంజయ్​ సక్సెస్​ అయ్యాడుగానీ, వాళ్ల రాజకీయ వారసత్వం ఇంకా అందుకోలేదు. గతంలో సమాజ్​వాది పార్టీ (ఎస్పీ) తరఫున లక్నో నుంచి లోక్​సభకు పోటీ చేయాలనుకున్నా కోర్టు ఆంక్షలవల్ల వీలు కాలేదు. అప్పటికే సంజయ్​ ఆయుధాల చట్టం కింద జైలుశిక్షకు గురయ్యాడు. ఈమధ్యనే బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్​ పక్ష (ఆర్​ఎస్పీ)లో చేరారు.  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఊహాగానాలున్నాయి.

Latest Updates