కిటికీ నుంచి పైపు వేసి.. పెట్రోల్ పోసి.. ఆరుగురికి నిప్పు

మీరట్‌లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన యూపీలో వెలుగుచూసింది. మీరట్, ఖార్ఖోడా ప్రాంతంలోని జాహిద్‌పూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రహీన్, తన ఐదుగురు పిల్లలతో కలిసి జీవిస్తుంది. రహీన్‌ 8 సంవత్సరాల క్రితం ఆమె భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి జాహిద్‌పూర్‌లో ఉంటుంది. రహీన్ కూలీగా పని చేస్తూ.. పిల్లలను పోషించుకునేది. మంగళవారం రాత్రి రహీన్ మరియు ఆమె పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో రహీన్ మరియు ఆమె పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. దుండగులు కిటికీ మెష్ ద్వారా పైపును ఇంట్లోకి పంపి.. ఆ పైపుతో ఇంట్లో పెట్రోల్ పోశారు. ఆ తర్వాత అగ్గిపుల్ల గీసి ఇంట్లోకి వేసినట్లుగా తెలుస్తోంది.

ఖార్ఖోడా పోలీస్‌‌స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ బిష్ట్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేదానిపై రహీన్‌కు ఎవరిపై అనుమానాలు లేవు. రహీన్ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆమె ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమెతో మాట్లాడి.. కేసు గురించి దర్యాప్తు చేస్తాము’ అని అన్నారు.

రహీన్ దూరపు బంధువు ఫాతిమా మాట్లాడుతూ.. ‘రహీన్ మాత్రమే ఆ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి. పనిలేని సమయంలో ఆమె పిల్లలతో ఎక్కువగా గడిపేది. ఆమెకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. అసలు ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియడంలేదు’ అని అన్నారు.

Latest Updates