వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైల్ రోకో.. ఫార్మర్స్ బాడీ పిలుపు

చండీగఢ్: వ్యవసాయ రంగానికి సంబంధించి మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త బిల్లును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్‌‌‌సిమ్రత్ కౌర్ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షమైన అకాళీదల్ పార్టీ నేత అయిన సిమ్రత్ కౌర్ మంత్రిగా తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యవసాయానికి సంబంధించిన మూడు కొత్త బిల్లులపై పంజాబ్, హర్యానాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ బిల్లును నిరసిస్తూ ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు పంజాబ్‌‌లో రైల్ రోకోకు ఫార్మర్ బాడీ పిలుపునిచ్చింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఈ నెల 24-26 వరకు రైల్ రోకో నిర్వహించనున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఇప్పటికే ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌‌లోని కొన్ని రైతు సంఘాలు బంద్‌‌కు పిలుపునిచ్చాయి. కొత్త బిల్లుల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ) విధానం నిర్వీర్యం అవుతుందని, పెద్ద కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సదరు బిల్లుల ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర, మార్కెట్‌‌ను పొందుతారని చెబుతోంది.

Latest Updates