దేశవ్యాప్తంగా మార్చి10న రైళ్లను ఆపుతాం: రైతు సంఘాలు

దేశవ్యాప్తంగా మార్చి10న రైళ్లను ఆపుతాం: రైతు సంఘాలు

ఎన్నికల కోడ్​ వచ్చినా.. తమ ఉద్యమం ఆపమని రైతు సంఘాలు ప్రకటించాయి.  మార్చి 10 వ తేదీన రైళ్ల రాకపోకలను ఎక్కడికక్కడ నిర్భందిస్తామని తెలిపారు.  ఫిబ్రవరి 13 నుంచి ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనలో  యువరైతు  శుభకరన్ సింగ్  నివాసంలో సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఢిల్లీలోనే ఉంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. 

 మరణించిన యువరైతు ఇంట్లో  పంజాబ్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, బీకేయూ సిద్దూపూర్ సహా ఇతర రైతు సంఘాల సమావేశం జరిగింది.  రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ.. సమావేశంలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సంఖ్యను పెంచుతామన్నారు. రైతులంతా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లోనే కూర్చుంటారని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతు సోదరులు నిరసన ప్రాంతాలకు చేరుకొని.. 10 వ తేదీన రైల్​ రోకో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.  ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చినా ఉద్యమం కొనసాగించి తీరుతామని ఐక్య కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు తెలిపారు.

 మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకుని రైల్ రోకో నిర్వహిస్తామని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్ తెలిపారు.  రైతుల డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.  కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికలపై దృష్టి పెట్టడాన్ని రైతు సంఘాలు ఖండించాయి.  బీజేపీ నేతలు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని డిమాండ్​ చేశారు. తాము స్వచ్ఛందంగా నిరసన తెలుపుతుంటే... కేంద్ర ప్రభుత్వం కొన్నిసంస్థలు నిరసన చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. SKM (నాన్ పొలిటికల్) , KMM సహా  200 కంటే ఎక్కువ  రైతు సంఘాలు  దేశవ్యాప్తంగా ఉద్యమంచేస్తున్నాయని  రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్వాల్ అన్నారు.  బీజేపీ ఐటీ సెల్ తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఉద్యమంపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు  ప్రయత్నిస్తోందన్నారు.