
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మా ఊరికి గోదాం కట్టిస్తవా లేదా సారూ అంటూ ఓ రైతు కేటీఆర్‌ను ప్రశ్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్సబ్ స్టేషన్ ప్రారంభోత్సానికి మంత్రి కేటీఆర్ శుక్రవారం వచ్చారు. కేటీఆర్కోసం రైతులు కూడా వచ్చారు. సబ్‌స్టేషన్ ప్రారంభించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. సత్కరించేందుకు ఓ శాలువాను కూడా తీసుకువచ్చారు. నర్సింహారెడ్డి అనే రైతు అందరి ముందు ‘అయ్యా కేటీఆర్సారూ.. మీరు అన్ని మంచిగనే చేస్తుండ్రు.. మా ఊరికి సబ్స్టేషన్కూడా ఇచ్చిండ్రు, సంతోషం. కానీ.. మీరు గతంలో మా ఊరి రైతుల కోసం గోదాం నిర్మాణం చేయిస్తనని చెప్పిండ్రు.. కావాలని చేస్తలేరా.. మరిచిపోయిండ్రా’ అని ప్రశ్నించాడు. దాంతో కేటీఆర్మీ ఊరికి గిన్ని చేసినోళ్లం.. గోదాం నిర్మించి ఇవ్వలేమా.. గత అభివృద్ధికి, నేను వచ్చినంక అభివృద్ధికి తేడా చూడాలే. మీ ఊరికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్న అంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం నర్సింహారెడ్డి సన్మానించేందుకు శాలువాను తీయగా కేటీఆర్తిరస్కరించారు. మీ ఊరికి గోదాం కట్టి ఇచ్చాకే నీతోని సన్మానం పొందుతానని అన్నారు. అయ్యా ఏం అనుకోకు.. సబ్‌స్టేషన్ పెట్టినందుకన్న ఈ సన్మానం చేసుకొండ్రి అనగా.. శాలువతో ఆ రైతునే కేటీఆర్ సత్కరించి వెళ్లిపోయారు.