కృష్ణా ఫేజ్–1 పైపులైన్ కు బీటలు

  • రెండేళ్లుగా వృథా అవుతున్న సాగర్ నీరు
  • లీకేజీ నీటితో వరి సాగు చేస్తున్న రైతు
  • చోద్యం చూస్తున్నజలమండలి అధికారులు

యాచారం, వెలుగు:  హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు జలమండలి ఓ వైపు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు పైప్​లైన్​ లీకై భారీగా కృష్ణా నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. నిత్యం గోదావరి, కృష్ణా, సింగూర్, మంజీర మొదలగు చోట్ల నుంచి 500  మిలియన్ గ్యాలన్లకు పైగా నీటిని  కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ల ద్వారా నగరానికి తరలిస్తుంటారు. నగరానికి నలువైపులా ఉన్న రిజర్వాయర్లకు చేర్చిన తర్వాత ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తారు. కృష్ణా నీటిని సాగర్ నుంచి హైదరాబాద్ కు తీసుకురావడం కోసం మొత్తం 3  ఫేజ్ లలో పైప్ లైన్లు వేశారు. ప్రతి రోజు ఒక్కో ఫేజ్​పైప్ లైన్ ద్వారా 90 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలిస్తారు. ఈ పైప్​ లైన్లు ఏర్పాటు చేసి దాదాపు పదేళ్లవుతోంది.  ప్రస్తుతం హైదరాబాద్  ప్రజల తాగునీటి కష్టాలు తీర్చే ప్రధాన వనరు సాగర్​జలాలే.  సిటీ ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ. కోట్లు వెచ్చించి పలు అంచెల్లో నీటిని శుద్ధి చేసి పంపింగ్ ద్వారా తరలిస్తున్నారు. ఈ పైప్ లైన్ చాలావరకు భూగర్భంలో నుంచి ఉండగా కాలువలు ఉన్న చోట బ్రిడ్జిని నిర్మించారు. తక్కళ్లపల్లి గ్రామం వద్ద రెండేళ్లుగా పైప్​లైన్​ లీకై  భారీగా నీరు వృథాగా పోతోంది. లక్షల రూపాయల ప్రజాధనం నేల పాలవుతోంది. రెండేళ్లుగా లీకేజీ అవుతున్న కృష్ణా నీటిని గూర్చి సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఒకే చోట ఉన్న లీకేజీ నేడు అనేక చోట్ల లీక్ అవుతోంది. కానీ నేడు రోడ్డు పక్కనే నీరు లీకేజీ అయి ఎగజిమ్ముతోంది. అధికారులు తక్షణం మరమ్మతులు చేయించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

లీకేజీ నీటితో వ్యవసాయం

నాగార్జున​సాగర్ నుంచి హైదరాబాద్​ వరకు వేసిన పైప్ లైన్​ పలుచోట్ల లీకేజీ కారణంగా ప్రతిరోజు ఎంతో శుద్ధ నీరు వృథాగా పోతోంది. ఆ నీటిని ఏళ్లుగా స్థానిక రైతు వరి చేనుకు తరలిస్తున్నాడు. గతంలో నీరు కొద్దిగా లీకేజీ అయ్యేవి కానీ ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తంగా నీరు లీకేజీ కారణంగా ఎకరాల్లో వరి పైరు సాగుచేస్తున్నాడు. కోట్ల రూపాయలు పెట్టి శుద్ధి చేసిన మంచి నీరు చేనుకు పెడుతుండడంతో  ప్రైవేట్​వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును నేల పాలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

ఒకటిన్నర రోజులు నీరు బంద్ చేయాల్సి ఉంటుంది

ఒక్కో ఫేజ్ నుంచి ప్రతి రోజు 90మిలియన్ గ్యాలన్ల నీరు హైదరాబాద్ ప్రజలకు సరఫరా అవుతుంది. తక్కళ్లపల్లి గేట్ సమీపంలో కొంతకాలంగా నీరు లీకేజీ అవుతోంది. ఇదికృష్ణా ఒకటో దశ పైపులైన్ గా గుర్తించాం.వేసవి ఉన్నందున రిపేర్ చెయ్యలేదు.మరమ్మతులు చేయడానికి ఒకటిన్నరరోజులు హైదరాబాద్ నగరానికి నీటిసరఫరా బంద్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే తీవ్ర  నీటికొరత ఏర్పడుతుంది.అందుకోసం  ఉన్నతాధికారుల అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. అనుమతులు రాగానే మరమ్మతులు చేపడతాం. త్వరలోనే నీరు వృథాగా పోకుండా అరికడతాం.– వి.బాబు, డీజీఎం,హైదరాబాద్  మెట్రోపాలిటన్ వాటర్ సప్లై

వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు

గతంలో తక్కువ నీరు వృథాగాపోతుండేది. రెండేళ్లు గా నీరు ఎక్కువవృథాగా పోతోంది. మరమ్మతులు చేసినీటి వృథాను అరికట్టా లి. ఓ వైపు చాలాచోట్ల నీళ్లకోసం ప్రజలు అల్లాడుతుంటేమరో వైపు ఈ వృథాను అరికట్టడంలేదు.– కోరె జగదీశ్ రావు, తక్కళ్లపల్లి

Latest Updates