తాలుతో తంటాలు..ఎకరా పంటపై దాదాపు రూ.2 వేలు లాస్

హైదరాబాద్‌, వెలుగు:ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట పండింది. కానీ వడ్లు అమ్ముకునేందుకు మార్కెట్​కు వెళ్లిన రైతులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, తేమ పేరుతో తూకంలో డిలే చేయడంతోపాటు తాలు, తరుగు పేరుతో కోతలు పెడుతున్నారు. క్వింటాలు ధాన్యానికి ఏకంగా ఐదారు కిలోలు కోత పెడుతుండడంపై  రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు రగిలి అక్కడక్కడ ధాన్యానికి నిప్పుపెట్టుకుంటున్నారు.

40 కిలోల బస్తాల్లో తూకం

హార్వెస్టర్లు రాక ముందు 70 కేజీల బస్తాలో తూకం వేసేవారు. సంచీకి కిలో, తాలు, మట్టి కింద మరో కిలో తరుగు తీసేవారు. కానీ ఇప్పుడు 40 కేజీల బస్తాల్లో తూకం వేస్తున్నారు. ఇలా ఒక్కో సంచిపై కనీసం రెండు కిలోలు కోత పెడుతున్నారు. ఈ లెక్కన 38 కిలోలే బర్తీ లెక్కిస్తున్నారు. ఇలా క్వింటాకు తాలు పేరుతో ఐదారు కిలోల తరుగు పోతోంది. క్వింటాల్‌‌ వడ్లలో కిలోకు మించి తాలు ఉండదని రైతులు అంటున్నారు. ఇక సంచి బరువు పేరిట మరో కిలో కోత పడుతోంది.

ఇప్పటివరకు కొన్నది 20% వడ్లే..

ఈ సీజన్‌‌లో 1.05 లక్షల టన్నుల వడ్లు పండుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. వాటిని కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,077 పర్చేజ్‌‌ సెంటర్లు ఓపెన్‌‌ చేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. కానీ గురువారం నాటికి 5,817 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమవగా 23.90 లక్షల టన్నుల వడ్లను కొన్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 20 శాతం ధాన్యమే ఇప్పటి వరకు కొన్నట్టు తెలుస్తోంది.

టోకెన్ల సిస్టం పనిచేయట్లే

రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఇప్పటికి 70 శాతం కోతలు పూర్తవగా పది, పన్నెండు రోజుల్లో కోతలు పూర్తవుతాయి. మే 10 వరకు పూర్తిస్థాయిలో ధాన్యం మార్కెట్​కు రానుంది. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో పర్చేజ్‌‌ సెంటర్లు ప్రారంభించారు. ముందే టోకెన్లు ఇచ్చి ఆ తేదీల్లోనే ధాన్యం తేవాలని  ప్రభుత్వం ప్రకటించింది. అయితే గ్రామాల్లో టోకెన్ల పంపిణీ సరిగా లేదు. ఒక్కో ఏఈవోకు మూడు నుంచి ఐదు కొనుగోలు కేంద్రాలు ఉండటంతో ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. రోజూ అన్ని గ్రామాలకు వెళ్తున్నా పర్చేజ్‌‌ సెంటర్ల నిర్వాహకులతో కో ఆర్డినేట్‌‌ చేసుకుని రైతులకు టోకెన్లు ఇవ్వడం వీలు కావట్లేదు. ఏఈవో గ్రామంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లిన రైతులకే టోకెన్లు అందుతున్నాయి. మిగతా వాళ్లు కోసిన వరి పంటను నేరుగా పర్చేజ్‌‌ సెంటర్‌‌కు తీసుకెళ్లి అక్కడే ఆరబోస్తున్నారు.

ఎండబెట్టుడు, ఎత్తుడు

ఈనెల 15 వరకు అన్ని ప్రాజెక్టుల కింద కాలువలకు నీళ్లు వదిలారు. దీంతో వడ్లలో కొంతమేర తేమ శాతం ఉంది. 17 శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే కొనేది లేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో టోకెన్‌‌ ఉన్నా రైతులు ఆ రోజు పంటను అమ్ముకోలేక పర్చేజ్‌‌ సెంటర్‌‌లోనే ఆరబోస్తున్నారు. రోజూ ఎండబెట్టడం, ఎత్తడం.. ఇదే పని. కొన్నిచోట్ల అకాల వర్షాలకు వడ్లు నీటిపాలవుతున్నాయి. సరిపోను టార్పాలిన్లు లేవని రైతులు ఆరోపిస్తున్నారు.

పర్చేజ్‌‌ సెంటర్లలో మిల్లర్ల హవా

కొన్నిచోట్ల స్వయం సహాయక మహిళల కొనుగోలు సెంటర్లను పీఏసీఎస్‌‌ అధికారులు తెరవనీయకుండా వాళ్లే పర్చేజ్‌‌ సెంటర్లు ఓపెన్​చేశారు. ఈ సెంటర్లలో కోతలు ఎక్కువుంటున్నాయని రైతులు చెప్తున్నారు. ఈ సెంటర్లలో రైస్‌‌ మిల్లర్ల హవా నడుస్తోందని, వారి జోక్యంతోనే తాలు పేరుతో ఎక్కువ తరుగు తీస్తున్నారని చెప్తున్నారు.

వారం కింద అమ్మిన.. చీటీ ఇయ్యలే

వారం కింద 83 బస్తాల వడ్లు అమ్మిన. 41 కిలోల చొప్పున తూకం వేసి సంచి కిలో తరుగు తీసిండ్రు. వడ్లను మిల్లుకు పంపిన తర్వాత బస్తాకు రెండు కిలోల లెక్కన తాలు పేరుతో తరుగు తీస్తామన్నరు. దీనిపై ఐకేపీ ఆఫీసర్లకు కంప్లైంట్‌‌ చేసిన. వాళ్లు స్పందించలే. నేను అమ్మిన వడ్లకు ఇప్పటికీ చీటీ ఇయ్యలే.  మిల్లర్‌‌ తరుగు తీసినంకనే తూకం లెక్క గడుతమని అంటున్నరు.

– సంజీవ్‌‌, రైతు, దండేపల్లి, ఎల్కతుర్తి మండలం, వరంగల్‌‌ అర్బన్‌‌ జిల్లా

రెండున్నర కిలోల తరుగు

కింటా వడ్లకు రెండున్నర కిలోల తరుగు తీసిండ్రు. వడ్లు మంచిగనే ఉన్నయని చెప్పినా.. అందరికీ ఈ లెక్కనే తీస్తున్నమన్నరు. కింటాకు ఒక్క కిలో తరుగు తీస్తే పోనీలే అనుకుందుము. 40 కిలోల బస్తాకు ఇన్ని కిలోలు తీసుడేంది?

– చంద్రయ్య, వావిలాల, మహబూబాబాద్‌‌ జిల్లా

మిగతా ధాన్యం కొనేదెప్పుడు?

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడిచినా 20 శాతం వడ్లే కొన్నారు. ఇంకా 80 శాతం ధాన్యాన్ని కొనాలి. ఇందులో సగానికిపైగా వడ్లు పర్చేజ్‌‌ సెంటర్లకు చేరాయి. వాటిని త్వరగా కాంటాలు వేసి మిల్లులు, నిల్వ కేంద్రాలకు తరలిస్తే పర్చేజ్‌‌ సెంటర్లు ఖాళీ అవుతాయి. అప్పుడే మిగతా రైతులు వడ్లు సెంటర్లకు తెచ్చే వీలుంది.

సగం సౌలత్‌‌లు

గతేడాది 3,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉండగా ఈసారి వాటిని డబుల్‌‌ చేశారు. వడ్లు కొనాలంటే వాటి తేమను చెక్‌‌ చేయాలి. అందుకు 13,390 మాయిశ్చర్‌‌ మీటర్లు అవసరం. కానీ ఇప్పటి వరకు 5,723 మాత్రమే వచ్చాయి. వడ్లలోని తాలును క్లీన్‌‌ చేసేందుకు 6,690 ప్యాడీ క్లీనర్లు అవసరం. కానీ1,450 సెంటర్లలోనే అవి అందుబాటులో ఉన్నాయి. రైతులు తెచ్చిన వడ్లను కింద పోయకుండా 1.67 లక్షల టార్పాలిన్లు తెప్పించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. కానీ 98 వేల టార్పాలిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Latest Updates