రైతు భరోసా మరో వెయ్యి పెంపు

రూ.12,500 నుంచి 13,500లకు

అమరావతి, వెలుగు: వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రైతులు పంట వేసుకునే మే నెలలో రూ.7,500, అక్టోబరులో పంట కోసే సమయానికి లేదా రబీ పంట పెట్టుబడి కోసం రూ.4 వేలు, సంక్రాంతి సమయంలో రూ.2 వేలు అందిస్తామని చెప్పారు. ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ. 67,500 సాయం అందిస్తామన్నా్రు. సోమవారం వ్యవసాయ కమిషన్ పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.50 వేల నుంచి రూ.67,500 పెంచామని చెప్పారు. రాష్ర్టంలోని 63 లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా రైతులను అర్హులుగా గుర్తించారు. మిగిలిన రైతులు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. 13 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వ్యవసాయ అధికారులు కౌలు రైతుల వద్ద పట్టా పాసుపుస్తకాలు, కౌలు అర్హత పత్రాలు లేవనే కారణంతో పథకాన్ని తిరస్కరించరాదని సూచించారు. గత మూడేళ్ల పంటలు వేశారో లేదో చూసి అర్హులను ఎంపిక  చేయాలన్నారు. రైతు ల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలు, ప్రమాదాల్లో మరణించిన రైతు భార్యకు కూడా పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. రైతుల పిల్లలు ఉద్యోగులై ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నా సేద్యం చేసుకునే తల్లిదండ్రులకు ఈ పథకం అమలు చేస్తామన్నారు. ప్రస్తుత, మాజీ  ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్ప మిగతా ప్రజా ప్రతినిధులందరికీ రైతు భరోసా సాయం అందించాలని ఆదేశించారు.

నేడు ప్రారంభం

వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని మంగళవారం నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి రావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని జగన్ ఆహ్వానించారు. ఆయన పర్యటన ఖరారు కాకపోవడంతో  జగన్ తానే ప్రారంభించాలని నిర్ణయించారు. మొదటగా కౌలు రైతులకు రుణ అర్హత, పంట హక్కులకు సంబంధించిన కార్డులు పంపిణీ చేస్తారు. పెట్టుబడిసాయం చెక్కులను రైతులకు అందిస్తారు.

Latest Updates