రైతులపై దాడులెందుకు?.. అన్నదాతలు ఏమైనా టెర్రరిస్టులా?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోకి దూసుకొస్తున్న రైతులను పోలీసులు, జవాన్లు అడ్డుకోవడం హింసాత్మకంగా మారింది. ఈ విషయంపై శివ సేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ఫైర్ అయింది. అన్నదాతలను ఉగ్రవాదులుగా చూస్తున్నారంటూ సామ్నా తన ఎడిటోరియల్‌‌లో మండిపడింది. రైతులపై ఎందుకు దాడులు చేస్తున్నారని, అన్నదాతలు ఏమైనా టెర్రరిస్టులా అంటూ ప్రశ్నించింది.

‘రైతులను టెర్రరిస్టులుగా చూస్తున్నారు. వారిపై ఢిల్లీ సరిహద్దుల్లో దాడులు చేస్తున్నారు. ఉగ్రవాదులు మన సైనికులను చంపుతున్నారు. మరి అన్నదాతలేం చేశారని వారితో అలా వ్యవహరిస్తున్నారు? బీజేపీ అరాచకాన్ని సృష్టించాలని చూస్తోంది’ అని సామ్నా రాసుకొచ్చింది. రైతుల ఉద్యమానికి ఖలిస్తాన్ తీవ్రవాదంతో లింకులు ఉన్నాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై సామ్నా స్పందించింది. ‘ఖలిస్తాన్ అనేది ముగిసిన అధ్యాయం. దీని కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, జనరల్ అరుణ్‌‌కుమార్ వైద్య తమ ప్రాణాలను సైతం అర్పించారు. విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం తన బలాలన్నింటినీ వాడుతోంది. కానీ శత్రు దేశాలను ఎదుర్కోవడంలో మాత్రం ఇదే సంకల్పాన్ని చూపడం లేదు’ అని సామ్నా రాసుకొచ్చింది.

Latest Updates