పరిహారం కోసం రైతుల ధర్నా

కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో  10 వేల ఎకరాల్లో పంట నష్టం

మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ముంపు రైతుల ఆందోళన

జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్​ ఎదుట ధర్నా

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు రైతులు కదం తొక్కారు. బ్యాక్​వాటర్, ప్రాణహిత ఎగపోటుతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్​తో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. చెన్నూర్​, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన వందలాది రైతులు బీజేపీ పిలుపు మేరకు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. ముందుగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్​వెరబెల్లి రఘునాథ్​రావు ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తాలోని డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడినుంచి బీజేపీ లీడర్లు, రైతులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్​వరకు ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగారు. కలెక్టరేట్​ఏవో సురేష్​కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రఘునాథ్​రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్​వల్ల చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో 10 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాలని, ముంపు భూములకు ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పోరాటం ఉద్ధృతం చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు చుక్కనీరు కూడా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్​ సొంత జిల్లా సిద్దిపేటకు నీళ్లు, కమీషన్ల కోసం తీసుకున్న తుగ్లక్​ చర్య  కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయని ఆరోపించారు. రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ లబ్ధికోసం దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పార్టీ జిల్లా జనరల్​సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ మాట్లాడుతూ చెన్నూర్​ నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగితే ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ పరిశీలించలేదని, రైతులకు భరోసా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించే  విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కలెక్టర్ నీటమునిగిన పంటలను పరిశీలించి రైతులకు వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. ఆందోళనలో బీజేపీ స్టేట్​లీడర్​ గోనె శ్యామ్​సుందర్​రావు, జిల్లా లీడర్లు గోపతి మల్లేష్, వెంకటేశ్వర్లుగౌడ్, జూల లక్ష్మణ్, రమణరావు, కృష్ణమూర్తి, రజనీష్​జైన్, వివిధ మండలాల అధ్యక్షులు, టౌన్​లీడర్లు పాల్గొన్నారు.

ఎకరానికి రూ. 30 వేలు ఇవ్వాలె

మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

ప్రాణహిత వరదతో మునిగిన భూములను కాళేశ్వరం ముంపు భూములుగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేలా డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మండిపడ్డారు. వరదతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో మందమర్రి, కోటపల్లి, వేమనపల్లి రైతులు 10 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. ఎకరానికి రూ.30 వేలు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు. కేసీఆర్ ఇంజనీర్ కాకున్నా కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని రీడిజైన్ చేశారన్నారు. దాని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా ఇదే జరుగుతోందని, నష్టపోతున్న రైతుల భూములను స్వాధీనం చేసుకొని వారికి వేరేచోట ప్రభుత్వం భూములు కేటాయిస్తేనే  రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

For More News..

వడ్ల కొనుగోలు కేంద్రంలో గోల్​మాల్​.. రూ. 14 లక్షలు కొట్టేసిన మహిళ ఆపరేటర్

అధికారుల తప్పిదంతో మూడేళ్లుగా అందని రైతుబంధు

రైతు.. ఇప్పుడిక బిజినెస్ మ్యాన్

Latest Updates