ప్రభుత్వం ఆదుకోవాలి: అకాల వర్షాలు రైతులను ముంచాయి…

అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో… చేతికొచ్చిన పంట నేల కొరిగింది. అమ్మకానికి మార్కెట్ కు తీసుకెళ్లిన ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయింది. అప్పులు తెచ్చి పండించిన పంట కళ్ల ముందే దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. నష్టపోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి, పత్తి పంటలు నీట మునిగాయి.  భారీగా వర్షం పడటంతో పొట్ట దశలో ఉన్న వరి నేల పాలైంది. పత్తి కాయ నీళ్లల్లో మునిగిపోవడంతో దిగుబడి దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హార్, పలిమేల మండలాల్లో భారీ వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న కురిసిన వర్షానికి దాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. దాదాపు 3వందల క్వింటాళ్ల మక్కలు తడిశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మక్కలు మార్కెట్ కు తెచ్చి వారం గడుస్తున్నా… అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. తడిసిన దాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు నిజామాబాద్ జిల్లాలోని రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కుండపోత వానలకు పొట్ట దశలో ఉన్న వరి నేల బారింది. సోయా నల్లబడింది.  వరద నీటిలో మునిగిపోవడంతో పంట దెబ్బతింది. ఆరబెట్టిన ధాన్యమంతా తడిసిపోయింది. అకాల వర్షాలతో  నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నారాయణపేట జిల్లా తంగిడిలోని రైల్వే బ్రిడ్జి దగ్గర కృష్ణ, బీమా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నది పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. నారాయణపూర్ డ్యాం నుంచి 4లక్షల 75వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు తంగిడిలోని సంగమేశ్వర ఆలయం చుట్టూ నీరు చేరింది.

Latest Updates