రైతులపై పోలీసుల దాడి.. యుద్ధభూమిలా మారిన ఘజియాబాద్

ఢిల్లీ : కిసాన్ క్రాంతి పాదయాత్ర సందర్బంగా ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది. నిరసన యాత్రలో పాల్గొన్న దాదాపు 30వేల మంది రైతులను ముందుకు కదలకుండా… ఢిల్లీ సరిహద్దు ఘజియాబాద్ ఏరియాలో పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. వేలాదిగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టే ఉద్దేశంతో… వారిపై భాష్ప వాయువు, వాటర్ కెనాన్స్ ప్రయోగించారు పోలీసులు. ముందడుగు వేయకుండా అడ్డుకోవడంతో.. పోలీసులకు.. రైతులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. బారికేడ్లు దాటేందుకు విశ్వప్రయత్నం చేసిన అన్నదాతలపై పోలీసులు దాడి చేయడంతో.. చాలామంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ బోర్డర్ లోని ఘజియాబాద్ ఉద్రిక్తంగా మారింది.

రైతు సమస్యలు పరిష్కరించాలంటూ సెప్టెంబరు 23న హరిద్వార్ నుంచి ఢిల్లీకి రైతు యాత్ర ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకుంటున్నారు రైతులు. రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు, బోరు బావులకు ఉచిత కరెంటు, విద్యుత్ చార్జీలు తగ్గింపు, అన్ని పంటలకు ఫసల్ బీమా‌యోజన ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి, చక్కెర రైతులకు పెండింగ్ బకాయిలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకోవడం సహా మొత్తం 21 డిమాండ్లతో ఢిల్లీ బాటపట్టారు రైతులు.

కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారిస్తుందని నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని.. అయినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు. రైతు సంఘాల ప్రతినిధులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సరిహద్దులోని రోడ్లపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు పోలీసులు. తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్‌ విధించారు. భారీగా బలగాలను మోహరించారు.

 

Posted in Uncategorized

Latest Updates