ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతులు నిరసన తెలిపారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు... ఆర్మూర్ పట్టణంలోని ఎంపీ అర్వింద్ ఇంటిని చుట్టిముట్టారు. ఆయన ఇంటి ముందు వడ్లను పారబోసి ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్రం ప్రభుత్వం వడ్లు కొనకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రైతులకు ముఖం చూపించలేక ఎంపీ అర్వింద్ ఢిల్లీలో తలదాచుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా... వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. వడ్ల కొనుగోలు జాప్యానికి ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపైనొకరు బురద జల్లుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. సోమవారం ఢిల్లీలో వరి దీక్ష నిర్వహించిన కేసీఆర్... వడ్ల కొనుగోలుకు కేంద్ర సర్కార్ కు 24 గంటల గడువిచ్చారు. ఆయనకు పోటీగా హైదరాబాద్ లో బీజేపీ నాయకులు వరి దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేట్ మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 

కాగా.. తన ఇంటి ముందు వడ్లు పోసి ఆందోళన నిర్వహించినవారు నిజమైన రైతులు కాదని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొంత మంది కూలీలకు డబ్బులిచ్చి రైతులుగా సృష్టించారని ఆరోపించారు.