మా పొలం.. ఎవరికో పట్టా: MRO ఆఫీస్‌లో ఉరేసుకోబోయిన రైతు కుటుంబం

చిత్తూరు: ఓ వైపు అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై రెవెన్యూ అధికారుల ఆందోళనలు.. మరోవైపు పొలం పట్టాదారు పాసు పుస్తకాల అన్యాయం జరిగిందంటూ రైతుల నిరసనలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. నిన్న తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఓ మహిళ లంచం డబ్బులు వెనక్కి ఇచ్చెయ్ అంటూ గొడవకు దిగిన విషయం హల్ చల్ చేస్తుండగానే.. ఇవాళ ఏపీలో మరో ఘటన జరిగింది.

తమ పొలంపై వేరెవరికో పట్టా ఇచ్చారంటూ MRO ఆఫీసులోనే ఉరి వేసుకోబోయింది ఓ రైతు కుటుంబం. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరిగింది.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం MRO ఆఫీసుకు ఇవాళ ఉదయం ఓ రైతు కుటుంబమంతా వచ్చింది. తమ పొలాలపై ఇతరులకు పట్టాలు ఇచ్చారంటూ ఐదుగురు కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. తాము 40 ఏళ్లుగా సాగు చేస్తుకుంటున్న ఆ పొలాలను వేరెవరికో చెందినవని ఎలా నిర్ణయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం MRO ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోని అధికారులు వాటిని వేరెవరికో కట్టబెట్టారని ఆవేదన చెందారు. తమకు న్యాయం జరిగేలా లేదంటూ వెంట తెచ్చిన తాళ్లు కట్టి ఉరేసుకోబోయారు. అప్రమత్తమైన అధికారులు వారి సమస్యను పరిష్కరిస్తామని సర్ధిచెప్పారు.

Latest Updates