అకాల వర్షంతో తడిసిన ధాన్యం…కష్టాల్లో అన్నదాతలు

  • చందుర్తిలో పిడుగుపడి ఒకరి మృతి
  •  తడిసిన ధాన్యం కొనాలంటూ రైతుల డిమాండ్‌
  •  పంటలను పరిశీలించిన ఆఫీసర్లు , నాయకులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, సైదాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూరు మండలాల్లోభారీ వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో, జగిత్యాల జిల్లా పెగడపల్లి, కొడిమ్యాల  మండలాల్లో వర్షం కురిసింది. ఈ ఏడాది సమృద్ధిగా నీరు ఉండటంతో పుష్కలంగా పంటలు పండాయి. వరి చేలు చాలా చోట్లకోసి.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కొంత మంది రైతులవి కాంటాలు కూడా అయ్యాయి. మరికొంత మంది కాంటా కోసం కల్లాల్లోనే ఆరబోసి వేచి చూస్తున్నారు. ఇంతలోనే ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలుచోట్ల వరద రావడంతో వడ్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. వడ్లరాశుల మీద పరదాలు కప్పినా.. పెద్దగా ఫలితం లేకపోయింది. టార్పాలిన్లు లేక కాపాడుకోలేకపోయారు.

తడిసిన ధాన్యం

ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం బాగా తడిసిపోయింది. పగటి పూట వాన పడితే ఎలాగోలా కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ.. తెల్లవారు జామున ఒక్కసారిగా కురవడంతో చాలా మంది రైతులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. కొన్ని చోట్ల వర్షం ఎక్కువగా కురిసి వరదలు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం.. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. గన్నేరువరం మండలంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ఒక్క జన్నెపల్లి లో మాత్రమే ప్రారంభించారు. దీంతో మిగిలిన కేంద్రాల్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అక్కడ కూడా ఎలాంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి జిల్లా మొత్తం ఇదే పరిస్థి తి కనిపించింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమ ధాన్యం తడిసిపోయేది కాదని రైతులు వాపోతున్నారు.

కానరాని టార్పాలిన్లు

ఈ సారి కరోనా ప్రభావంతో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వర్షం కురిసినా.. ఎండలు కాసినా రక్షణ చర్యలు కల్పించడంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ సీజన్‌లో వర్షాలు కురుస్తాయని.. రెండు రోజుల కిందటే వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది. అయినా అధికారులు అప్రమత్తంగా లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా… రైతుల పంటలకు సరిపడా టార్పాలిన్లు లేవు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్రా నుంచి టార్పాలిన్లు కిరాయికి ఇచ్చే వారు సైతం ఇక్కడికి రాలేదు. దీంతో అటు ప్రభుత్వం ఇవ్వక.. ఇటు కిరాయికి దొరక్క నష్టపోవాల్సి వచ్చింది.

 కొనుగోళ్లలో ఆలస్యం

ధాన్యం అధిక స్థాయిలో తడవడానికి మరో ప్రధాన కారణంకొనుగోళ్లు ఆలస్యంగా చేపట్టడమే. తాలు, తేమ శాతం ఉన్నాయంటూ.. పదే పదే వాటిని తూర్పారా పట్టించడం.. ఆరబెట్టడం చేస్తుండడం తో వారం పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉంటోంది. దీనికితోడు చాలా చోట్లఅధికారులు.. ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. కొనుగోళ్లుప్రారంభించలేదు. కానీ రైతులు ఆయా కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకొచ్చి రెడీగా ఉన్నారు.

భారీ నష్టం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా చోట్లవరి చేలు ఈదురు గాలులు, వడగండ్లకు నష్టపోయాయి. అలాగే ఈదురు గాలులు వీయడంతో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలతో ధాన్యం తడసి ముద్ద వ్వడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో అకాల వర్షాలకు 2,791 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిగిలిన చోట్ల కళ్లాల్లో ఉన్నధాన్యం భారీ స్థాయిలో తడిసింది. ఈ తడిసిపోయిన ధాన్యాన్ని సైతం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పిడుగుపడి రైతు మృతి

రాజన్నసిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో జిల్లా అతలాకుతులమైంది. చందుర్తి మండలంలో భారీ వర్షం కురవడంతో టార్పాలిన్ కవర్ కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లిన భార్యా భర్తలపై పిడుగు పడింది. దీంతో రైతు పళ్ల శ్రీనివాస్ అక్కడిక్కడే చనిపోగా. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

Latest Updates