టోల్‌గేట్ దగ్గర ఆగేదే లేదు…

fastag-in-online

వివిధ బ్యాంకులకు ఎన్​హెచ్​ఏఐ అవకాశం

అమెజాన్​ సైట్​లోనూ అమ్మకం

డిసెంబర్​ 1.. టోల్​ గేట్​ దగ్గర ఆగకుండా వెళ్లేందుకు కేంద్రం ఫాస్టాగ్‌ను అమలు చేయబోతున్న డేట్‌ ఇది. ప్రతి వాహనానికీ దానిని తప్పనిసరి చేసేసింది కేంద్ర ప్రభుత్వం. అది లేకుండానూ టోల్​గేట్​ దాటిపోవచ్చు. కాకపోతే, కట్టే టోలే రెట్టింపు ఉంటుంది. కేంద్రం ఫాస్టాగ్​ను తీసుకురావడానికీ ఓ కారణముంది. టోల్​గేట్​ దగ్గర ఆగిన ప్రతిసారీ ట్రాఫిక్​ సమస్యలు వస్తున్నాయి. పండుగలప్పుడైతే పరిస్థితి మరింత అధ్వాన్నం. అందుకే ఈ ఫాస్టాగ్​ను తీసుకొస్తోంది కేంద్రం. మరి, చాలా మందికి ఆ ఫాస్టాగ్​ను ఎక్కడ తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే టోల్​గేట్ల వద్ద ఫాస్టాగ్​ పేమెంట్​ పద్ధతిని నేషనల్​ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ), కేంద్ర రోడ్డు రవాణా శాఖలు అమలు చేస్తున్నాయి. ఇకపై ఆన్​లైన్​లోనూ ఫాస్టాగ్​ను తీసుకోవచ్చు. అందుకోసం ఎన్​హెచ్​ఏఐ, ఇండియా హైవేస్​ మేనేజ్​మెంట్​ కంపెనీ లిమిటెడ్​ (ఐహెచ్​ఎంఎల్​)లు కలిసి సేవలు అందిస్తున్నాయి. అందుకు కొన్ని బ్యాంకులకు వాటిని ఆన్​లైన్​లో అమ్మే అవకాశం కల్పించాయి. అంతేగాకుండా అమెజాన్​లోనూ అందుబాటులో పెట్టాయి.

ఇవీ బ్యాంకులు

ఎస్​బీఐ, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​, కరూర్​ వైశ్యా బ్యాంక్​, సిండికేట్​ బ్యాంక్​, ఫెడరల్​ బ్యాంక్​, సరస్వత్​ బ్యాంక్​, సౌత్​ ఇండియన్​ బ్యాంక్​, ఐడీఎఫ్​సీ బ్యాంక్​, ఈక్విటాస్​ బ్యాంక్​, పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​. ఆన్​లైన్​లో కొనేటప్పుడు వాటికి కేవైసీ వెరిఫికేషన్​ కూడా వాహనదారులు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆర్​సీ కార్డు, అడ్రెస్​ప్రూఫ్​, ఫొటోను జత చేయాలి.

ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది?

ఫాస్టాగ్​ అంటే కేవలం ఓ స్టిక్కరే. కారు అద్దానికి అతికించుకుంటే సరిపోతుంది. ఆ స్టిక్కర్​పై ఆర్​ఎఫ్​ఐడీ కోడ్​ ఉంటుంది. దానిని రీడ్​ చేసేలా టోల్​గేట్ల దగ్గర ఫాస్టాగ్​ రీడర్లను పెడతారు. ఏదైనా వాహనం ఫాస్టాగ్​ లేన్​ నుంచి వెళుతున్నప్పుడు ఆ ఆర్​ఎఫ్​ఐడీ కోడ్​ను ఆ రీడర్లు స్కాన్​ చేసి, కావాల్సిన టోల్​ను ఆటోమేటిగ్గా కట్​ చేసేస్తాయి. దీని వల్ల టోల్​గేట్ల దగ్గర ఆగే బెడద తప్పుతుంది. ట్రాన్సాక్షన్​ జరిగిన ప్రతిసారీ రిజిస్టర్​ చేసుకున్న ఫోన్​ నంబర్​కు మెసేజ్​ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్​లైన్​లోనే ప్రీపెయిడ్​ రీచార్జ్​ చేయించుకోవచ్చు.

Latest Updates