టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ లేకుంటే తిప్పలే..!

హైదరాబాద్, వెలుగు:

టోల్ గేట్ల దగ్గర వాహనాల నుంచి ఆటోమేటిక్​గా టోల్​ ఫీజు వసూలు చేసే ఫాస్టాగ్​ సిస్టంను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నేషనల్ హైవేల మీద ఉన్న 17 టోల్ గేట్ల దగ్గర నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్ హెచ్ఏఐ) అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. అన్ని టోల్​గేట్ల వద్ద కూడా కేవలం ఒక్క లేన్​ను మాత్రమే క్యాష్​ చెల్లింపుల కోసం అందుబాటులో ఉంచుతామని, మిగతావాటిలో ఫాస్టాగ్​ ఉన్న వెహికల్స్​కు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్తున్నారు. ఫాస్టాగ్​ లేకుంటే టోల్​గేట్ల వద్ద ఇబ్బందులు తప్పవని, చాలా సేపే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

ఎట్ల పనిచేస్తది?

ఫాస్టాగ్ స్టిక్కర్ ను కారు ముందు అద్దం దగ్గర.. బయటికి కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టోల్ గేట్ దగ్గరకు వాహనం రాగానే అక్కడుండే స్కానర్.. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) స్కాన్ చేసి.. గేట్​ను ఓపెన్​ చేస్తుంది. ఈలోగానే ఫాస్టాగ్​లో లోడ్​ చేసి ఉన్న సొమ్ము నుంచి ఆటోమేటిక్​గా టోల్ ఫీజు కట్ అయి.. టోల్ ప్లాజా కంపెనీ ఖాతాలో జమ అవుతుంది. వాహనాలు ఆగకుండా సాఫీగా, త్వరగా వెళ్లేందుకు వీలవుతుంది.

అమలు ఇట్లా..

టోల్ గేట్ల దగ్గర ఐదారు టోల్​బూత్​లు ఉంటే.. అందులో ఒక్క మార్గాన్ని మాత్రమే క్యాష్  చెల్లింపులకు అనుమతిస్తారు. మిగతా వాటన్నింటినీ ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలకే కేటాయిస్తారు. ఫాస్ట్ ట్యాగ్  లేని వాహనాలు ఈ మార్గాల్లోకి వస్తే డబుల్ చార్జీలు వసూలు చేస్తామని ఎన్​హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ కృష్ణ మోహన్  తెలిపారు. ఫాస్టాగ్ అమలు, దానిపై వాహనదారులకు అవగాహన కల్పించటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆర్టీఏ కేంద్రాల్లో అమ్మకాలు..

ఈ నెల ఒకటో తేదీ నుంచే టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లు అమ్ముతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ కేంద్రాల్లో విక్రయించేలా ప్లాన్​ చేస్తున్నామని నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు చెప్తున్నరు.

రద్దీ బాధలు తప్పుతయ్..

వీకెండ్లు, పండుగల సమయాల్లో హైవేలపై ట్రాఫిక్​ బాగా ఎక్కువగా ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్​ జామ్​లు కావడం, టోల్​ చెల్లించేందుకు ఒక్కోసారి గంటల పాటు వేచి చూడాల్సి రావడం జరుగుతోంది. దీనివల్ల టైం వేస్ట్​ కావడంతోపాటు భారీగా పెట్రోల్, డీజిల్  కూడా వృథా అవుతోంది. ఏటా టోల్ గేట్ల దగ్గర వాహనాల వెయిటింగ్​ సమయం, ఇంధనం వృథా విలువ రూ.83 వేల కోట్ల మేర ఉంటుందని ఓ సర్వే కూడా తేల్చింది. ఒక్కోసారి పోలీసులు కల్పించుకుని ట్రాఫిక్​ క్లియర్​ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. టోల్ సిబ్బందికి, వెహికిల్​ ఓనర్లకు మధ్య గొడవలూ జరిగాయి. ఫాస్టాగ్​తో ఈ సమస్యలు తీరతాయి.

రాష్ట్రంలో 17 టోల్ ప్లాజాలు

రాష్ట్రంలో నేషనల్ హైవేలపై 17 టోల్ ప్లాజాలు ఉన్నాయి. నిత్యం లక్షలాది వెహికల్స్​ ప్రయాణిస్తుంటాయి. వీకెండ్లు, పండుగల సమయంలో ట్రాఫిక్​ భారీగా ఉంటుంది. చిల్లకల్లు, గూడూర్, ఇందల్వాయి, పంతంగి, కొర్లపహాడ్, రాయికల్, శాఖాపూర్, రొల్ మామడ, పిప్పల్ వాడ, గంజాల్, చింతపల్లి, పుల్లూర్, కోనేటి పురం, మనోహరాబాద్, భిక్కనూర్, కడ్తాల్, ముత్తోజిపేట వద్ద టోల్ ప్లాజాలున్నాయి.

Latest Updates