సెల్ ఫోన్ కోసం బిడ్డను అమ్మిన తండ్రి

అమె పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాపను కన్నది. కానీ, ఆమె భర్త  పాపను తీసుకెళ్లి అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో మందుకొట్టాడు. తన కొడుకుకు బంగారు గొలుసు కొన్నాడు. తన కోసం మంచి స్మార్ట్​ఫోన్​ కొనుక్కున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో బుధవారం జరిగింది. ఆ బిడ్డను అమ్మిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విక్రమసింగపురంలోని అరుగంపట్టి గ్రామానికి చెందిన యేసుఇరుదయరాజ్​, పుష్పలత దంపతులకు ఇంతకుముందే ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు. నవంబర్​ 8న మరోసారి పుష్పలత కవలలకు జన్మనిచ్చింది. అయితే, మళ్లీ అమ్మాయి పుట్టడం నచ్చని యేసుఇరుదయరాజ్​, పిల్లలు లేని ఓ జంటకు ఆ పాపను ₹1.8 లక్షలకు అమ్మేశాడు. సెల్వం, నెల్లయప్పర్​, కణ్నన్​ అనే మధ్యవర్తుల సహకారం తీసుకున్నాడు. వచ్చిన డబ్బులో యేసుఇరుదయరాజ్​ లక్ష రూపాయలు తీసుకోగా, ఆ ముగ్గురు దళారులు మిగతా 80 వేలు పంచుకున్నారు. అయితే, పాపను అమ్మిన విషయం పుష్పలతకు మాత్రం తెలియదు. కొన్ని రోజులుగా చెకప్​లకు తీసుకురాకపోవడంతో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది వచ్చి నిలదీసే సరికి అసలు విషయం చెప్పాడు. పాపను చైల్డ్​లైన్​ సంస్థకు పోలీసులు అప్పగించారు.

 

Latest Updates