ఏడుపు ఆపట్లేదని కూతుర్ని చంపిన తండ్రి

ఘజియాబాద్: ఏడుపు ఆపడం లేదని కన్న కూతురినే చంపేశాడో మూర్ఖుడు. ఈ ఘటన ఘజియాబాద్‌‌లో జరిగింది. తన కూతురి శవంతో ఆటో రిక్షాలో తిరుగుతున్న 28 ఏళ్ల వాసుదేవ్ గుప్తా అనే సదరు నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తాన్‌‌పూర్‌‌కు చెందిన వాసుదేవ్‌‌ తన భార్యతో కలసి గత కొన్నేళ్లుగా ఖోడా కాలనీలో రెంట్ హౌజ్‌‌లో ఉంటున్నాడు. అతడి భార్య నోయిడాలోని ఒక స్పాలో పని చేస్తోంది. రీసెంట్‌‌గా వాసుదేవ్‌‌కు అతడి భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో అతడి భార్య మూడేళ్ల కూతురిని వాసుదేవ్ వద్దే వదిలేసి వెళ్లిపోయింది.

ఆటో రిక్షా డ్రైవర్ అయిన వాసుదేవ్ తన భార్య ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. ఇదిలా ఉండగా.. గురువారం వాసుదేవ్ కూతురు బాగా ఏడ్వసాగింది. చిన్నారి ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో వాసుదేవ్‌ ఆమె గొంతు పిసికాడు. దీంతో చిన్నారి చనిపోయింది. ఆ చిన్నారిని ఆటోలో పడుకోబెట్టి నోయిడా, ఖోడా కాలనీల్లో తన భార్య కోసం వెతకసాగాడు. విషయం తెలుసుకున్న ఘజియాబాద్ పోలీసులు వాసుదేవ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై సెక్షన్ 302 (మర్డర్) కింద కేసు నమోదు చేశారు. స్థానిక కోర్డు నిందితుడ్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. నిందితుడి కూతురి శవాన్ని అటాప్సీ రిపోర్టు కోసం పంపించారు. వాసుదేవ్ భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest Updates