అది యుద్ధం కాదమ్మా.. గేమ్

సిరియాలోని యుద్ధ పరిస్థితులను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బాంబు పేలుళ్లు, కాల్పుల శబ్దానికి తన కూతురు భయపడకుండా ఉండేందుకు ఓ తండ్రి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది. అక్కడ జరుగుతోంది యుద్ధం కాదని… అదొక గేమ్ అని ఆయన తన కూతురికి చెబుతూ ఆమెను నవ్వింపజేస్తున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది. సిరియాలోని ఇడ్లీబ్ ప్రాంతంలో కొన్ని రోజులుగా బాంబు బ్లాస్టింగ్స్, కాల్పులు ఆగడం లేదు. ఇదే ప్రాంతంలో అబ్దుల్లా ఆల్ మహమ్మద్ కుటుంబం నివసిస్తోంది. ఆయనకు నాలుగేళ్ల కూతురు ఉంది. ఓ రోజు వారింటికి దగ్గర్లోనే బాంబులు పేలాయి. దీంతో చిన్నారి భయపడిపోయింది. కంగారు పడిన అబ్దుల్లాకు… అవేం శబ్దాలని కూతురుకు చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడే ఆయనకో ఐడియా వచ్చింది. అదొక గేమ్ అని, హాలీ డేస్ లో ఇలా బొమ్మ తుపాకులను పేలుస్తారని చెప్పాడు. అలా చేస్తే తన కూతురు భయపడకుండా ఉంటుందని, నవ్వుతుందనే ఉద్దేశంతో అలా చెప్పానని తెలిపాడు. తండ్రి చెప్పినట్టుగానే ఆ చిన్నారి కూడా బాంబుల శబ్దం, కాల్పుల మోత వినిపించినప్పుడల్లా అదొక గేమ్ అనుకొని నవ్వుతోంది. బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూతురితో పాటు అబ్దుల్లా నవ్వుతున్న వీడియోను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Latest Updates