ప్రభుత్వ సొమ్ముతో కాష్ పటేల్ జల్సా..గర్ల్ఫ్రెండ్తో డేట్ కోసంరూ.30 లక్షల సూట్

ప్రభుత్వ సొమ్ముతో కాష్ పటేల్ జల్సా..గర్ల్ఫ్రెండ్తో డేట్ కోసంరూ.30 లక్షల సూట్
  • వరుస వివాదాల్లో అమెరికా ఎఫ్​బీఐ డైరెక్టర్

వాషింగ్టన్‌‌: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌‌బీఐ) డైరెక్టర్‌‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే కాష్ పటేల్ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ అధికారాలను, నిధులను తన వ్యక్తిగత విలాసాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. ప్రభుత్వ జెట్ విమానాన్ని లగ్జరీ డేటింగ్ కోసం వాడటం, పవిత్రమైన పర్ల్ హార్బర్ మెమోరియల్ వద్ద ‘వీఐపీ స్నార్కెలింగ్’ (ఈత కొట్టడం) చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై న్యూయార్క్‌‌ టైమ్స్‌‌లో కథనం ప్రచురితమైంది.

నిరుడు మే 10న కాష్ పటేల్ తన గర్ల్‌‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌‌తో కలిసి వాషింగ్టన్ నుంచి ఫిలడెల్ఫియాకు ఎఫ్‌‌బీఐకి చెందిన అధికారిక గల్ఫ్‌‌స్ట్రీమ్ వీ జెట్ విమానంలో వెళ్లారు. అక్కడ ఒక కంట్రీ మ్యూజిక్ కన్సర్ట్‌‌ను వీక్షించడానికి ఫిలడెల్ఫియాలోని లింకన్ ఫైనాన్షియల్ ఫీల్డ్‌‌లో ఒక ప్రైవేట్ సూట్‌‌ను బుక్ చేశారు. దీని ధర దాదాపు రూ. 30 లక్షల నుంచి రూ.42 లక్షలు ఉంటుంది. కాగా, విల్కిన్స్‌‌ను నిర్వాహకులే ఆహ్వానించారని ఎఫ్‌‌బీఐ ప్రతినిధి వివరణ ఇచ్చారు. 

అయితే ఈ పర్యటనకు ఎవరు డబ్బులు చెల్లించారనే ప్రశ్నపై పటేల్ సమాధానం దాటవేశారు.  
పెర్ల్ హార్బర్ వద్ద 30 నిమిషాలపాటు ఈత..గత వేసవిలో హవాయి పర్యటనకు వెళ్లిన ఆయన, కేవలం మిలిటరీ డైవర్లకు మాత్రమే అనుమతి ఉండే అత్యంత పవిత్రమైన పెర్ల్ హార్బర్ మెమోరియల్ వద్ద నిబంధనలను ఉల్లంఘించి 30 నిమిషాల పాటు ఈత కొట్టడం సైనికులను అవమానించడమేనని విమర్శలు వస్తున్నాయి.

అలాగే, మిలాన్ వింటర్ ఒలింపిక్స్‌‌లో యూఎస్ హాకీ జట్టు గెలిచినప్పుడు ఆయన ఆటగాళ్లతో కలిసి లాకర్ రూమ్‌‌లో పార్టీ చేసుకోవడంపై వివాదం రేగింది. మరోవైపు, ఆయన తన గర్ల్‌‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌‌కు ఏడాదికి రూ.8.3 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో భారీ భద్రతను కేటాయించడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.