ప్రధాని కన్నెర్ర జేస్తే మీరు జైల్లో ఉంటారు

దుబ్బాకలో ఓటమితో మీ పునాదులు కదులుతాయి –బాబు మోహన్

కరీంనగర్: ప్రధాని ఒక్కసారి కన్నెర్ర జేస్తే మీరు జైల్లో ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలని బీజేపీ నాయకుడు, సినీ నటుడు బాబు మోహన్ హెచ్చరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించాడని… ఇది చాలా హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. నిన్న రాత్రి నుండి ఇంట్లోనే దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను బాబు మోహన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ… హరీశ్ రావు చిన్న పిల్లాడిలాగా ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడన్నారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారని ఆరోపించారు.  ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారు.. హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారు… నిన్నటి ఘటనపై చర్యలు తప్పవు… ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుందన్నారు. సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు. రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయం అని జోస్యం చెప్పారు. అధికారం ఉందని ఇలాగే చేస్తే  ప్రధాని కన్నెర్రజేస్తే మీరు జైల్లో ఉంటారని గుర్తుంచుకోవాలని.. దుబ్బాక ఫలితంతో  మీ పునాదులు కదలబోతున్నాయని బాబు మోహన్ హెచ్చరించారు.

 

Latest Updates