ఆర్మీ అటాక్ భయం: జనాల ఇళ్లలో నక్కిన జైషే ఉగ్రవాదులు

జమ్ము/న్యూఢిల్లీ: పాక్ ఉగ్రవాదులకు భారత ఆర్మీ భయం పట్టుకుంది. పుల్వామా దాడి తర్వాత ముష్కరుల అంతు చూడడం ఖాయమని వాళ్లకూ అర్థమైపోయింది. దెబ్బకు భయంతో వణుకుతూ స్థావరాల్లో ఉంటే ఎక్కడ అటాక్ జరుగుతుందోనని జనాల మధ్యకు చేరారు. పౌరుల ప్రాణాలు పోకూడదన్న ఉద్దేశంతో జవాన్లు వెనుకా ముందూ చూసుకుని దాడికి దిగుతారని కశ్మీర్ లోని ఇళ్లలో నక్కి ఉండడమే మేలని టెర్రరిస్టులు డిసైడ్ అయ్యారు. ఇలా దాగిన వాళ్లంతా పాక్ లో శిక్షణ పొంది అక్రమంగా భారత్ లోకి చొరబడిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులే.

పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ లో తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్లో ఆర్మీ జవాన్లు పుల్వామా దాడి సూత్రధారి, జైషే కమాండర్ రషీద్ ఘాజీ సహా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఇద్దరు కూడా ఓ ఇంట్లో నక్కి ఉండగా జవాన్లు రంగంలోకి దిగి హతమార్చారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాతి నుంచి మొదలైన ఎన్ కౌంటర్ ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది. అయితే లోపల మరో టెర్రరిస్టు ఉన్నాడని అనుమానం రావడంతో ఆ ఇంటిని బాంబులతో పేల్చేసినట్లు తెలుస్తోంది. అలాగే సోపియన్ జిల్లాలోనూ కార్డన్ సెర్చ్ ను ఆర్మీ మొదలుపెట్టింది.

ఈ ఎన్ కౌంటర్ల నేపథ్యంలో ఆర్మీ అధికారుల ఎప్పటికప్పుడు పరిస్థితిని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కు అప్ డేట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన నివేదికలో చాలా మంది జైషే ఉగ్రవాదులు తమ స్థావరాలను వదిలి సేఫ్టీ కోసం జనావాసాల్లోకి దూరుతున్నారని తెలిపారు.

అలాగే కశ్మీర్ లోయలో దాదాపు 65 మంది జైషే ఉగ్రవాదులు వేర్వేరు చోట్ల దాగి ఉన్నట్లు నివేదికలో చెప్పారు. వారిలో 35 మంది పాక్ లో కఠిన శిక్షణ పొంది వచ్చినవాళ్లే.

మరోవైపు భారత ఆర్మీ దాడులకు సిద్ధమైన నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కూడా అప్రమత్తమైనట్లు ఆర్మీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

Latest Updates