ఫీజుల్ ఫుల్.. వసతులు నిల్

గుర్తింపు లేని కోర్సులు.. ఎక్కువ ఫీజులు

అఫిలియేషన్‍ రూల్స్ ఉల్లంఘిస్తున్న ప్రైవేట్‍ కాలేజీలు

షోకాజ్‍ నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

ఎంసెట్‍, జేఈఈ, నీట్‍ పేరుతో దోపిడీ

అనుబంధ హాస్టల్స్ నిర్వహణపైనా స్పష్టత లేని చట్టాలు

హైదరాబాద్‍, వెలుగు:  ప్రైవేట్ ఇంటర్‍ కాలేజీలు అఫిలియేషన్‍ నిబంధనలు బాహాటంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా.. ఇంటర్‍ బోర్డు అధికారులు స్పందించడం లేదు. ఒకవేల ఎవరైనా కంప్లైట్‍ చేస్తే తనిఖీలు చేసి షోకాజ్‍ నోటీసులు ఇచ్చి సరిపుచ్చుతున్నారు. సమస్య ఎక్కువ తీవ్రవ ఉంటే ఫైన్‍ వేసి వదిలేస్తున్నారు. అనుమతించిన ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులకు తోడు ఎంసెట్‍, నీట్‍, జేఈఈ, సీఏ తదితర కాంపిటీషన్‍ కోర్సులను కాంబినేషన్‍గా బోధిస్తూ పేరెంట్స్ దగ్గర లక్షలు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం పేరెంట్స్ అప్పులు చేసైనా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా.. వసతులు కల్పించలేకపోతున్నా పట్టించుకోవడం లేదు. కాలేజీలు, హాస్టళ్లలో తరుచూ తనిఖీలు చేయాల్సిన ఇంటర్‍ బోర్డు అధికారులు.. ఆ విషయాన్ని సీరియస్‍గా తీసుకోవడం లేదు. విద్యావేత్తలు, విద్యార్థి యూనియన్‍ నేతలు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలు 309 ఉన్నాయి.

లక్షల్లో ఫీజు.. వసతులు కరువు

జిల్లాలో పరిధిలో 264  ప్రైవేట్‍ కాలేజీలు అనుమతి తీసుకున్నాయి. అవి కాక ఇంకా అనేకం గుర్తింపు తీసుకోకుండానే గుర్తింపు కాలేజీలకు అనుబంధం అంటూ విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పైగా అనుమతి లేకుండానే హాస్టల్స్ నడిపిస్తున్నారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాల్సి ఉండగా అధిక శాతం కాలేజీలు అనుమతి తీసుకోకుండానే నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటర్​తో పాటు జేఈఈ, నీట్, జిప్‍మర్‍ తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నట్టు చెప్పి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్‍ బోర్డు నిబంధనలు ప్రకారం ఎంపీసీ ఫస్టియర్‍కు రూ.1760, సెకండియర్‍కు రూ.1940 ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ ఏ ప్రైవేటు కాలేజీలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తీసుకోవడం లేదు. పైగా కాలంతో పాటు కొత్త ఫీజులను నిర్ణయించాలని ఇంటర్​ బోర్డును కోరుతున్నామని ఓ ప్రైవేట్‍ కాలేజీ నిర్వహకులు తెలిపారు.

ఆధారాలతో ఫిర్యాదు చేసినా..

సైదాబాద్‍లోని శ్రీచైతన్య, ఆర్‍టీసీ క్రాస్​రోడ్డులోని గౌతమ్‍ జూనియర్‍ కాలేజీలు అనుమతి లేని కోర్సులు, అధిక ఫీజులు తీసుకుంటున్నారని ఫోరం ఎగైనెస్ట్ కరెప్షన్‍ ప్రెసిడెంట్‍ విజయ్‍గోపాల్‍ జిల్లా ఇంటర్మీడియట్‍ అధికారికి 2018 జులై 31 ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన డీఐఈఓ ఫిబ్రవరి 2, 2018లో ఆయా కాలేజీలకు షోకాజ్‍ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్‍ ఫర్‍ ప్రొటెక్షన్‍ ఆఫ్‍ చైల్డ్ రైట్స్(ఎన్‍సీపీసీఆర్‍) చైర్‍పర్సన్‍కు 2018 డిసెంబర్‍ 19న ఫిర్యాదు చేశారు. ఎన్‍సీపీసీఆర్‍ హైదారబాద్‍ జిల్లా కలెక్టర్‍కి వివరాలు తెలుపమని నోటీసు ఇచ్చింది. జులై 7, 2019న ఆయా కాలేజీలపై తీసుకున్న చర్యలు తెలపాలని జిల్లా కలెక్టర్‍ డీఐఈఓకు లెటర్‍ రాశారు.

దీనికి సమాధానంగా డీఐఈఓ ఆగస్టు 5, 2019న లెటర్‍ పంపారు. అందులో ఫిర్యాదు వచ్చిన కాలేజీలను తనిఖీలు చేశామని, అందులో శ్రీచైతన్య కాలేజీ బైపీసీ-+నీట్‍+ఎంసెట్‍ పేరుతో రెండు సంవత్సరాలకు రూ.66 వేలు ఫీజు తీసుకున్నట్లు ఆధారాలు లభించినట్లు తెలిపారు. అదే విధంగా బైపీసీ+నీట్‍కు రూ.58 వేలు ఫీజు తీసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ట్లుగా రూ.2.10 లక్షల ఫీజులు తీసుకున్నట్లు గుర్తించలేదంది. అలాగే గౌతం కాలేజీలో దాదాపు ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించినట్లు కలెక్టర్‍కు పంపిన లెటర్‍లో డీఐఈఓ పేర్కొన్నారు. బైపీసీ, ఎంపీసీ కోర్సులకు మాత్రమే బోర్డు అనుమతి ఉందని, ఎంసెట్‍, నీట్‍ తదితర కాంపిటీటివ్‍ సిలబస్‍ నిర్వహణకు అనుమతి లేదన్నారు.  ఆ రెండు కాలేజీలకు షోకాజ్‍ నోటీసులు ఇష్యూ చేశామని, ఉల్లంఘనలు నిజమని రుజువైతే మొదటి సారి తప్పు చేసినందుకు  రూ.లక్ష ఫైన్‍ వేసే అవకాశం ఉందని, ప్రాథమిక చర్యగా ఆ రెండు కాలేజీల్లో 2019–20 అకాడమిక్‍ ఇయర్‍కు సంబంధించి నూతన అడ్మిషన్లు తీసుకోవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు డీఐఈఓ కలెక్టర్‍కు పంపిన లెటర్‍లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్‍ ఎన్‍సీపీసీఆర్‍ దృష్టికి తీసుకొచ్చారు.

ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు

1983 ఎడ్యుకేషనల్‍ యాక్ట్ లోని సెక్షన్‍ 7 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే కాలేజీల నిర్వహకులపై ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసి 3 ఏండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. జిల్లా మెజిస్ట్రేటైన కలెక్టర్‍కు ఆ అధికారం ఉన్నా వినియోగించడం లేదు. కేవలం షోకాజ్‍ నోటీసులతోనే సరిపుచ్చుతున్నారు. ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆ కాలేజీలపై చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్‍ కాలేజీల్లో ఫీజుల కట్టడి చేసేందుకు విద్యా చట్టాలను, నూతన నిబంధనలను తీసుకరావాల్సిన అవసరం ఉంది.

– విజయ్‍గోపాల్, 

ప్రెసిడెంట్‍, ఫోరం ఎగైనెస్ట్ కరెప్షన్‍

Latest Updates