ఇండియా ఖేల్​ఖతం!

మస్కట్‌‌: ఫిఫా వరల్డ్‌‌కప్‌‌ క్వాలిఫయింగ్‌‌ టోర్నీలో ఇండియా ఫుట్‌‌బాల్‌‌ టీమ్‌‌ నిరాశపర్చింది. మెయిన్‌‌ టోర్నీకి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌–ఈ లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా 0–1తో ఒమన్‌‌ చేతిలో ఓడింది. మోషిన్‌‌ అల్‌‌ ఘసాని (33వ ని.) ఏకైక గోల్‌‌తో ఒమన్‌‌ను గెలిపించాడు. ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లో కేవలం 3 పాయింట్లే సాధించిన ఇండియా.. టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ గ్రూప్‌‌లో ఖతార్‌‌ (13), ఒమన్‌‌ (12), అఫ్గానిస్థాన్‌‌ (4) టాప్‌‌–3లో ఉన్నాయి.  టాప్‌‌–2లో ఉండే టీమ్‌‌లు వరల్డ్‌‌కప్‌‌కు క్వాలిఫై అవుతాయి. ఇండియా మిగిలిన మూడు మ్యాచ్‌‌ల్లో గెలిచినా 9 పాయింట్లే వస్తాయి. కాబట్టి ముందుకెళ్లడం అసాధ్యం. అయితే ఈ మూడు మ్యాచ్‌‌ల్లో మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చూపితే.. 2023 ఆసియా కప్‌‌ క్వాలిఫయర్స్‌‌కు వెళ్లే చాన్స్‌‌ దక్కుతుంది.

ఈనెల 14న అఫ్గాన్‌‌తో మ్యాచ్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఇండియా హెడ్‌‌ కోచ్‌‌ ఇగోర్‌‌ స్టిమాక్‌‌.. మన్వీర్‌‌ సింగ్‌‌, ఫారుక్‌‌ చౌదరి, నిష్‌‌ కుమార్‌‌ను టీమ్‌‌లోకి తీసుకున్నాడు. 7వ నిమిషంలో మోషిన్‌‌ కొట్టిన షాట్‌‌ గోల్‌‌పోస్ట్‌‌ బార్‌‌పై నుంచి దూసుకెళ్లడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. చివరకు 33వ  నిమిషంలో పాస్‌‌ను అందుకున్న మోషిన్‌‌ నేర్పుగా గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపి ఒమన్‌‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఫస్ట్‌‌ హాఫ్‌‌ మొత్తం బంతిని ఎక్కువగా ఆధీనంలో ఉంచుకున్న ఒమన్‌‌ ప్లేయర్లు అటాకింగ్‌‌ స్కిల్స్‌‌తో అదరగొట్టారు. సెకండాఫ్​లో ఒకటి, రెండు చాన్స్‌‌లు వచ్చినా.. ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముగ్గురు సబ్‌‌స్టిట్యూట్‌‌లను బరిలోకి దించినా స్కోరును సమం చేయలేకపోయింది.

Latest Updates