మాంటెర్రే: గతంలో ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన స్వీడన్ ఈసారి మెరుపులు మెరిపించింది. గ్రూప్–ఎఫ్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో స్వీడన్ 5–1తో ట్యూనీసియాపై గెలిచింది. యాసిన్ అయారి (7, 90+6వ ని), అలెగ్జాండర్ ఇసాక్ (30వ ని), విక్టర్ గైకోరెస్ (59వ ని), మథియాస్ స్వాన్‌బెర్గ్ (84వ ని) స్వీడన్‌కు గోల్స్ అందించారు.
ట్యూనీసియా తరఫున ఒమర్ రెకిక్ (43వ ని) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన స్వీడన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అయాన్ లాంగ్ రేంజ్ షాట్స్‌తో రెచ్చిపోగా, ఇసాక్, గ్యోకెరెస్ మంచి సమన్వయంతో కదులుతూ ట్యూనీసియా గోల్‌పోస్ట్‌పై సమర్థవంతంగా దాడి చేశారు.
84వ నిమిషంలో మథియాస్ కొట్టిన గోల్‌ను వీఏఆర్ పరిశీలన తర్వాత అంపైర్లు ఖాయం చేశారు. అయితే అదనపు టైమ్‌లో యాసిన్ వ్యక్తిగతంగా రెండో గోల్ చేయడంతో స్వీడన్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం స్వీడన్ పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
- ఐవరీ కోస్ట్ సంచలనం
ఫిలడెల్ఫియా: సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్ కప్ ఆడుతున్న ఐవరీ కోస్ట్ సంచలన విజయం సాధించింది. లీగ్ తొలి మ్యాచ్‌లో 1–0తో ఈక్వెడార్‌పై గెలిచింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు (90వ ని) సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అమాద్ దియాల్లో మెరుపు గోల్ కట్టాడు. ఈ
ఓటమితో ఈక్వెడార్ గత 19 మ్యాచ్‌ల వరుస విజయాలకు బ్రేక్ పడింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి అర్ధభాగంలో ఈక్వెడార్ ఆటగాళ్లు జాన్ యెబోవా, నిల్సన్ అంగులో కొట్టిన బంతులు గోల్ పోస్ట్ పైభాగాన్ని (క్రాస్‌బార్) తాకుతూ వెలుపలికి వెళ్లాయి.
రెండో అర్ధభాగం 52వ నిమిషంలో ఐవరీ కోస్ట్ ఆటగాడు ఎలియే వాహి కొట్టిన షాట్ కూడా ఇదే విధంగా మిస్ అయింది. 68వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ గొంజాల్లో ప్లాటా కొట్టిన బలమైన షాట్‌ను ఐవరీ కోస్ట్ గోల్‌కీపర్ యాహియా ఫొఫానా అద్భుతంగా అడ్డుకున్నాడు. అయితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకుంటున్న తరుణంలో 90వ నిమిషంలో కుడి వైపు నుంచి విల్ఫ్రెడ్ సింగో వేగంగా బంతిని ముందుకు తీసుకెళ్లి అందించగా, అమాద్ దియాల్లో పెనాల్టీ ఏరియా లోపలి నుంచి ఎడమ కాలితో అద్భుతమైన షాట్ కొట్టాడు.
ఈక్వెడార్ గోల్‌కీపర్ హెర్నాన్ గలిందెజ్ డైవ్ చేసినా బంతిని ఆపలేకపోయాడు. దీంతో ఐవరీ కోస్ట్ సంబరాల్లో మునిగిపోయింది. 2014 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఐవరీ కోస్ట్.. నాకౌట్ దశకు చేరుకోవడానికి ఈ గెలుపుతో కీలక అడుగు వేసింది.
- నెదర్లాండ్స్‌కు జపాన్ షాక్..
టెక్సాస్: వరల్డ్ కప్ తొలి పోరులో జపాన్ అద్భుత పోరాటాన్ని చూపెట్టింది. గ్రూప్–ఎఫ్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన హోరాహోరీ పోరును 2–2తో డ్రా చేసుకుంది. ఈ డ్రాతో నెదర్లాండ్స్ గ్రూప్ దశలో తన అజేయ రికార్డును 17 మ్యాచ్‌లకు పొడిగించుకుంది. విర్జిల్ వాన్‌డిక్ (50వ ని), క్రిసెన్సియా సమ్మర్‌విల్లే (64వ ని) డచ్ తరఫున గోల్స్ కొట్టారు.
కిటో నకమురా (57వ ని), దైచీ కమడ (88వ ని) జపాన్‌కు గోల్స్ అందించారు. తొలి హాఫ్‌లో ఇరుజట్లు డిఫెన్స్‌కే పరిమితం కావడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండాఫ్‌లో ఇరుజట్లు అటాకింగ్ గేమ్‌కు దిగాయి. దాంతో 14 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ వచ్చాయి.
ఓ దశలో 2–1 ఆధిక్యంలో నిలిచిన డచ్ విజయం దిశగా వెళ్తున్న టైమ్‌లో జపాన్ అద్భుతం చేసింది. 88వ నిమిషంలో లభించన కార్నర్ కిక్‌ను దైచీ అత్యంత చాకచక్యంగా హెడర్ గోల్‌గా మలిచాడు. డచ్ గోల్ కీపర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. దాంతో జపాన్ క్యాంప్‌లో సంబురాలు మిన్నంటాయి.
