ఐదో విడత హరితహారానికి సర్వం సిద్ధం

రాష్ట్రంలో తొలకరి వానల పలకరింపుతో తెలంగాణకు హరితహారం ఐదో విడత కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ సారైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్ హరితహారాన్ని 2015 జులై 5 న తొలిసారి హైదరాబాద్‍లో ప్రారంభించారు. వేల కోట్ల బడ్జెట్ సైతం కేటాయిస్తున్నారు. ఏటా ఈ  కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ..  గడిచిన నాలుగు విడతల్లో అనుకున్న ఫలితాలు రాలేదు. కానీ, పేపర్ మీద మాత్రం లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పెట్టిన మొక్కలు.. చెట్టు అవ్వకముందే ఎండుతున్నాయి. నాలుగైదు రోజుల్లో ఐదో విడత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో మొక్కల నాటు నుంచి మొదలు పెంపకం, పర్యవేక్షణ, సంరక్షణ వరకు అయ్యే లెక్కపక్కలేంటో ఓ లుక్కేద్దాం

మొక్కలు.. చెట్లయితలేవ్

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గానికి 40 ల‌క్షలు, గ్రామానికి 40 వేల చొప్పున మొత్తం 230 కోట్ల మొక్కలు నాటి.. వాటిని సంర‌క్షించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.  ఇందులో అట‌వీ ప్రాంతంలో 100 కోట్లు, సామాజిక అడ‌వుల కింద 120 కోట్లు, హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో 10 కోట్ల వరకు మొక్కలు నాటాల‌ని నిర్ణయించింది. ఈ ఏడాది వీలయినంతవరకు ఎక్కువగా మొక్కలు పెంచడంతో పాటు రవాణా భారం తగ్గించేందుకు గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి విత్తనాలు నాటారు. అయినా వేల కోట్ల బడ్జెట్ ఖర్చవుతోంది. పేపర్లమీద చూపిస్తున్న మొక్కలు లెక్క తప్పుతున్నాయి. మొక్కలు నాటడం, ఆ తర్వాత పనికిరాకుండా పోవడం నాలుగైదేండ్లుగా సాధారణమైపోయింది. కారణాలేవైనా.. హరితహారం అనుకున్నమేర సక్సెస్ కావట్లేదు. మొక్కలు నాటేందుకు ఖర్చయిన డబ్బుల లెక్కలూ పక్కాగా చెప్పలేకపోతున్నారు. దీంతో హరితహారం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాకి లెక్కలతో సరిపెట్టారు..

హ‌రిత‌హారం ల‌క్ష్యంలో ఇప్పటి వరకు అడుగ‌డుగునా నిర్లక్ష్యమే కనిపించింది. మొక్కల సంరక్షణ పర్యవేక్షించాల్సిన అధికారులో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సీమీక్షల్లో మాత్రం ఏవేవో ‘కాకి లెక్కలు’ చూపించారు. జిల్లా, మండ‌ల కేంద్రాల్లో మొక్కల పెంపకంపై ప్రతిజ్ఞలు, ర్యాలీల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్రజలను భాగ‌స్వామ్యం చేయ‌డంలో  క్షేత్రస్థాయిలో ప్రణాళికల ఊసే లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యంపై ప్రభావం పడింది. కోట్ల నిధులు కేటాయించి.. లక్షలాది మొక్కలు నాటితే.. అందులో 30 శాతం కూడా బతకలేదన్న విషయాన్ని అధికారులు వెల్లడించడం గమనార్హం.

రికార్డుల కోసమేనా..

నాటిన మొక్క ఎదిగేందుకు కనీసం ఏడాదినుంచి రెండేళ్లయినా పడుతుంది. కానీ, హరితహారంలో నాటిన మొక్కల్లో కనీసం సగం మొక్కల్ని నాల్నెళ్ల పాటు కాపాడే పరిస్థితి లేదు. రికార్డుల కోసం ఒక్క రోజులో లక్షల మొక్కల్ని నాటుతున్నారు. అంతకు రెండింతలు నాటినట్లు లెక్కలు రాసుకుని కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఆపై వాటిని పట్టించుకునే అధికారులు ఉండడం లేదు. ట్రీ గార్డులు మాయం అవుతున్నాయి. మొక్కలు పశువుల మేతకవుతున్నాయి. మొత్తంమీద ప్రజాధనం ‘హ‌రితార్పణం’ అవుతోంది.

ఈసారైనా కాపాడేనా..

ఇన్నేళ్లలో నాటిన వాటిల్లో 30 శాతం మొక్కలు కూడా చెట్లు కాలేదన్నది వాస్తవం. ఈ క్రమంలో ఈ ఏడాది నాటే  మొక్కలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై ఐదో విడత హరితహారం సక్సెస్ ఆధారపడివుంది. కోట్లాది రూపాయలతో ఇన్ని మొక్కలు పెట్టామని చెప్పకుండా.. నాటిన వాటి సంరక్షణ చర్యలపై పాలకులు, ఆఫీసర్లు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. అప్పుడే ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది.

ప్రతీ మొక్క సంరక్షణకూ ఓ లెక్కుంది

అనుకున్న టార్గెట్ కన్నా..ఎక్కువ మొక్కలు నాటామని ప్రకటనలు ఇస్తున్న పాలకులు..ఎన్ని మొక్కలు బతికినయో ప్రకటించలేకపోతున్నారు. మొక్క నాటిన తర్వాత చెట్టుగా ఎదిగే వరకు సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది.. ఏ స్థాయిలో ఎంత మొత్తం కేటాయిస్తోందనే లెక్కలు మాత్రం చెబుతోంది. హరితహారంలో ఒక మొక్క సంరక్షణకు ఏడాదికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందనేది.. ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలివీ..

..రోడ్డు పక్కన పెట్టే మీటరున్నర సైజు మొక్కకు (మట్టి, పాలిథీన్ కవర్‍తో కలిపి) రూ.30

..ర‌వాణా ఖర్చు(దూరాన్నిబట్టి ఖర్చు ఇంకా పెరుగుతుంది)..రూ.1.50

..గుంత త‌వ్వడానికి కూలీ: రూ.20 ‌నుంచి 30

..మొక్క నాటేందుకుకూలీకి చెల్లించేది: రూ.04

..మొక్కకు సాయంగా ఊత కర్రకు: రూ.03‌ నుంచి 05

..నీరు పోసేలా పాదు తీయ‌డానికి: రూ.3.30 నుంచి రూ.5 వరకు

..ట్రీ గార్డు: రూ.180

..మధ్యలో మొక్క మారిస్తే: రూ.60 నుంచి 70

..మొక్కకు ఏడాది నీటి సరఫరాకు: రూ.300 నుంచి 350(వారానికి రూ.6 చొప్పున చెల్లింపు)

..ప్రధాన రోడ్డు, సిటీ, జంక్షన్లలో కాకుండా ప్రభుత్వ స్థలాల్లో,  రక్షణ గోడ ఉన్నచోటైతే.. 5/9 సైజు మొక్కలను నాటుతారు.  వీటికి 8 నెలల పాటు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇలాంటి మొక్కలకు సైతం ప్రభుత్వం తక్కువలో తక్కువ రూ.500 నుంచి 600 ఖర్చు చేస్తోంది.

వేల కోట్ల ఖర్చు ..

హరితహారం కార్యక్రమం కోసం సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 32 జిల్లాల పరిధిలోని 12,751 గ్రామ పంచాయతీల్లో  నర్సరీలను ఏర్పాటు చేసింది. అందులో దాదాపు 75 కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. నర్సరీలో మొక్కల పంపిణీకి ఇప్పటికే రూ.330 కోట్ల నిధులు కేటాయించింది. అధికారులు కాగితాలపై కోట్ల మొక్కలున్నట్లు చూపిస్తున్నారు. నిన్న మొన్నటివరకు దంచికొట్టిన ఎండలకు.. ఇందులో ఎన్ని మొక్కలు  తట్టుకుని బతికాయే తెలియట్లేదు. ఈ వారంలో సీఎం కేసీఆర్ ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నన్నారు. ఈ నేపథ్యంలో నర్సరీల నుంచి మొక్కల రవాణా, గుంతల తవ్వకం, మొక్కలు నాటడం, ఊత కర్ర, ట్రీ గార్డు, నీటి సప్లై, సంరక్షణ వంటి పనులకు సర్కారు వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది.

జిల్లాల వారీగా ఈ ఏడాది టార్గెట్లు..

1) ఆదిలాబాద్‍    1.48 కోట్లు

2) భద్రాచలం/కొత్తగూడెం1.38 కోట్లు

3) జగిత్యాల       2.89 కోట్లు

4) జనగామ      1.94 కోట్లు

5) జయశంకర్‍భూపాలపల్లి 2.07 కోట్లు

6) జోగులాంబ/గద్వాల్‍    1.92 కోట్లు

7) కామారెడ్డి      3.23 కోట్లు

8) కరీంనగర్‍      2.35 కోట్లు

9) ఖమ్మం        2.95 కోట్లు

10) కుమ్రంభీం    1.40 కోట్లు

11) మహబూబాబాద్‍       2.80 కోట్లు

12) మహబూబ్‍నగర్‍       5.11 కోట్లు

13) మంచిర్యాల  2.19 కోట్లు

14) మెదక్‍        4.24 కోట్లు

15) మేడ్చల్‍28 లక్షలు

16) నాగర్‍కర్నూల్‍2.68 కోట్లు

17) నల్గొండ4.23 కోట్లు

18) నిర్మల్‍2.27 కోట్లు

19) నిజామాబాద్‍4.47 కోట్లు

20) పెద్దపల్లి         1.82 కోట్లు

21) రాజన్న సిరిసిల్ల 1.58 కోట్లు

22) రంగారెడ్డి 2.04 కోట్లు

23) సంగారెడ్డి3.12 కోట్లు

24) సిద్దిపేట 4.12 కోట్లు

25) సూర్యపేట 2.09 కోట్లు

26) వికారాబాద్‍2.75 కోట్లు

27) వనపర్తి 1.81 కోట్లు

28) వరంగల్‍అర్బన్‍83 లక్షలు

29) వరంగల్‍రూరల్‍2.54 కోట్లు

30) యాదాద్రి/భువనగిరి2.48 కోట్లు

Latest Updates