ఫారిన్‌‌ ట్రిప్పూ.. ఏసీ బిల్లూ ఐటీకి దారి చూపిస్తాయ్‌‌

ఫారిన్ ట్రిప్‌‌లకు రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారా…? బ్యాంక్ అకౌంట్‌‌లో ఏడాదికి కోటి రూపాయలు డిపాజిట్ చేస్తున్నారా…? ఏడాదికి లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తున్నారా…? అయితే ఇక నుంచి మీరు ఐటీ రిటర్న్స్‌‌ను దాఖలు చేయాల్సిందే. పన్ను ఆదాయం, మినహాయింపు పరిమితి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నా… అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న వారిపై ప్రభుత్వం కన్నేసింది. వారికి ఐటీ రిటర్న్ ఫైలింగ్‌‌ను తప్పనిసరి చేసింది. బడ్జెట్ డాక్యుమెంట్స్‌‌లో ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

దీంతో హై వాల్యు ట్రాన్సాక్షన్స్‌‌ చేసే వ్యక్తులు ఇక నుంచి వారి ఆదాయాల రిటర్న్‌‌లు దాఖలు చేసేలా ప్రభుత్వం రూల్స్‌‌ను మారుస్తోంది. ఏ వ్యక్తి అయిన ఇక నుంచి కోటి కంటే ఎక్కువ మొత్తంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్‌‌ అకౌంట్లలో డిపాజిట్ చేసినా.. రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఫారిన్ ట్రిప్‌‌లకు ఖర్చు చేసినా..  లక్ష కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టినా ట్యాక్స్ రిటర్న్‌‌ను దాఖలు చేయాలని బడ్జెట్ డాక్యుమెంట్స్‌‌లో పేర్కొంది.

ఐటీ యాక్ట్ సెక్షన్ 54లోని పలు ప్రొవిజన్ల కింద దీర్ఘ కాలిక మూలధన లాభాల నుంచి పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతున్న వారు కూడా ట్యాక్స్ రిటర్న్‌‌లను ఫైల్ చేయాలి. ఇన్‌‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌‌లో తీసుకురాబోతున్న సవరణలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2020–21 అసెస్‌‌మెంట్ ఇయర్,ఆ తర్వాత ఏళ్లకు ఇవి వర్తిస్తాయని చెప్పింది.

నగదు లావాదేవీలను తగ్గించడానికి, బడ్జెట్‌‌ ఇన్‌‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌‌లో కొత్త సెక్షన్ 194ఎన్‌‌ ను ప్రతిపాదించింది. ఈ సెక్షన్ ప్రకారం బ్యాంక్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్ట్‌‌ ఆఫీసు ద్వారా ఎవరైనా వ్యక్తి కోటి కంటే ఎక్కువగా క్యాష్ పేమెంట్లు జరిపితే 2 శాతం చొప్పున టీడీఎస్‌‌ను వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సవరణ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే అమల్లోకి వస్తుంది.

Latest Updates