- వర్షాలకు ఉధృతంగా పారుతున్న వాగులు
- రెండు వారాలుగా ఇసుక లేక నిర్మాణాదారులకు ఇబ్బందులు
- పొలిటికల్ లీడర్ల అండతో గ్రామాల పొంటి కృత్రిమ ఇసుక తయారీ
- గొండ్యాలలో ట్రాక్టర్ డ్రైవర్లు, లీడర్ల మధ్య డబ్బుల పంచాయితీ!
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: రెండు వారాలుగా పాలమూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఊకచెట్టవాగు, దుందుభి వాగులకు భారీగా వరద వస్తుండడంతో ఉధృతంగా పారుతున్నాయి. దీంతో ఈ వాగుల్లో ఇసుక తీసేందుకు ‘మన ఊరు–-మన ఇసుక’ ఆన్లైన్ సైట్ ద్వారా ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడం తాత్కాలికంగా బంద్ చేసింది.
ఈ క్రమంలో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక దందాకు తెరలేపారు. జిల్లా స్థాయిలో ఉండే రాజకీయ నాయకుల పలుబడిని ఉపయోగించుకొని గ్రామ స్థాయి లీడర్లు ఈ దందా నిర్వహిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఫిల్టర్ ఇసుక..
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అడవి వెంకటాపూర్, రామచంద్రాపూరం, కోటకద్ర, కోడూరు.. హన్వాడ మండలంలోని గొండ్యాల్, మునిమోక్షం, వేపూరు, నవాబుపేట మండలం చౌటపల్లి, ఇప్పటూరు, మల్లారెడ్డిపల్లి, కారూరు గ్రామాల శివారులో ఫిల్టర్ ఇసుక వ్యాపారం నడుస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో లబ్ధిదారులకు ఇసుక అవసరం అవుతోంది. వాగు ఇసుక అందుబాటులో లేకపోవడంతో కొందరు మధ్యవర్తుల సాయంతో ఫిల్టర్ ఇసుకను కొంటున్నారు.
ఈ ఇసుక నాసిరకమని తెలిసినా.. తక్కువ రేటుకు వస్తుండడంతో లబ్ధిదారులు కూడా దీనినే కొంటున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో గతంలో దొంగచాటుగా ఫిల్టర్ ఇసుక దందా నడువగా.. ఇప్పుడు బహిరంగంగా రోడ్డు పక్కనే ఫిల్టర్ ఇసుక డంపులు వేసుకుని దందా సాగిస్తున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తయారు చేసిన ఫిల్టర్ ఇసుకను వివిధ ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఆ తరువాత ఆ ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.
గొండ్యాల్లో గొడవ..
హన్వాడ మండలం గొండ్యాల్లో ఇసుక మాఫియా, ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య ఇటీవల గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ దందాలో ప్రమేయం ఉన్న కొందరు లీడర్లు ఫిల్టర్ ఇసుక కోసం లబ్ధిదారుల నుంచి ముందుగానే ఒక ట్రిప్పు కోసం రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, ఈ ఇసుకను లబ్ధిదారుడికి చేర్చిన తర్వాత ట్రాక్టర్ ఓనర్లకు ట్రిప్పునకు రూ.1,300 చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజులుగా ఈ డబ్బును లీడర్లు ట్రాక్టర్ ఓనర్లకు ఇవ్వకపోడంతో వారి మధ్య వివాదం నడుస్తోంది.
ఐదు రోజులు కింద వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ విషయం బయటకు వస్తే పొలిటికల్‌గా డ్యామేజీఅవుతామనే భయంతో లీడర్లు జాగ్రత్త పడినట్లు తెలిసింది. కానీ, ట్రాక్టర్ ఓనర్లు మాత్రం డబ్బులు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్తామని, లేదంటే ఆందోళనలు చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు
తెలిసింది.
ఆగమైన మీనాంభరం..
నవాబుపేట మండలంలో మీనాంభరం వాగు ఆగమైంది. ఈ వాగు పొంటి ఉన్న వ్యవసాయ భూములను ఫిల్టర్ ఇసుక మాఫియా లీజుకు తీసుకొని దందా కొనసాగిస్తోంది. మరికొందరు ఏకంగా ఈ భూములనే కొనుగోలు చేస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే ఫిల్టర్ ఇసుక కోసం మీనాంభరం వాగులో తవ్వకాలు చేపట్టడంతో ఎక్కడికక్కడ వాగు ఆనవాళ్లు కోల్పోయింది. ఎగుడుదిగుడుగా మారడంతో వర్షాలు వచ్చినా వరద ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు హైవేకు ఈ వాగు దగ్గరగా ఉండడంతో ఫిల్టర్ ఇసుక వ్యాపారం సాఫీగా సాగుతున్నట్లు తెలిసింది. అలాగే మహబూబ్‌నగర్ నుంచి ప్రతి రోజూ రాత్రి పది బెంజ్ లారీల్లో ఫిల్టర్ ఇసుకను నింపుకొని పోతున్నట్లు సమాచారం.
మా దృష్టికి రాలేదు..
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో ఫిల్టర్ ఇసుక దందా నడుస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఇటీవల అడవి వెంకటాపురం గ్రామంలో ఫిల్టర్ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని సీజ్ చేశాం. ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నట్లు కంప్లైంట్లు వస్తే యాక్షన్ తీసుకుంటాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకుంటాం.- శ్రీనివాస్, తహసీల్దార్, మహబూబ్రూరల్
