వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్ . ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, GHMC అధికారుల సహాయంతో వరద ప్రభావిత కుటుంబాలను గుర్తించి, వారందరికీ  ఆర్థిక సహాయం అందించామన్నారు. అయితే ఇవాళ(శనివారం) ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి తమకు ఇంకా ఆర్థిక సహాయం అందలేదని కొంతమంది చేస్తున్న విజ్ఞప్తిలు తమ దృష్టికి వచ్చాయన్నారు.  ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి  సహాయం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని తెలిపారు కేటీఆర్. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్  తమకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సహాయం అందకుంటే, మరి కొద్ది రోజుల పాటు వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. వరదల్లో నష్టపోయిన ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.  దీనికి సంబంధించి GHMC అధికారులతో, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం తో రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం పై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Latest Updates