రూ.5 లక్షల ఆర్థిక సహాయం, కొత్త ఇళ్ళు ప్ర‌క‌టించిన సీఎం

భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సిఎం స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు ఇప్పటి వరకు 50 మంది మరణించారని, జీహెచ్ఎమ్‌సీ పరిధిలో 11 మంది మరణించారని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాలలో పంట నీట మునిగింద‌ని, ఇప్పటి వరకు 2 వేల కోట్ల పంట నష్టం జ‌రిగిందని చెప్పారు.

హైదరాబాద్ మొత్తంలో 72 ప్రాంతాల్లో 144 కాలనీలు 20,540 ఇళ్ళు ఇంకా నీటి లో ఉన్నాయని, 14 ఇళ్ళు పూర్తిగా , 65 ఇళ్ళు పాక్షికంగా ధ్వంసం అయ్యాయన్నారు. 445 చోట్ల బీటీ రోడ్డులు , 6 చోట్ల నేషన్ హైవేలు దెబ్బతిన్నాయని తెలిపారు.

ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్ లు , ఎస్పీడీసీఎల్ పరిధిలో 15 సబ్ స్టేషన్ లు , ఎన్పీడీసీఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్ లకు నీళ్లు వచ్చాయని, విద్యుత్ శాఖ కు దాదాపు 5 కోట్ల నష్టం జరిగిందని సీఎం తెలిపారు.

Latest Updates