అనామిక కుటుంబానికి అఖిలపక్ష నేతల ఆర్ధిక సాయం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా మనస్థాపం చెంది మృతి చెందిన విద్యార్థిని అనామిక కుటుంబానికి అఖిలపక్ష నేతలు ఆర్ధిక సాయాన్ని చేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు  కోదండరాం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్ రెడ్డి, టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి  సీపీఐ కార్యాలయంలో ఆమె కుటుంబానికి  లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలను ప్రభుత్వం అదుకోకపోవడం దారుణం, శోచనీయమని టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలను అదుకోవాలని డిమాండ్ చేశారు.  తమ వంతు బాధ్యతగా తాము కూడా వీలైనంత ప్రయత్నం చేస్తామన్నారు.

పీపుల్స్ సొసైటీ సహాకారంతో అనామిక కుటుంబానికి ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు  కోదండరాం అన్నారు. చనిపోయిన విద్యార్ధుల పట్ల సమాజంలో మంచి స్పందన ఉందని అన్నారు.  వారి కుటుంబాలకు ఆర్ధిక సహయం చేయాలనుకునే వారు తెలంగాణ  పీపుల్స్ సొసైటీ బ్యాక్ ఖాతా 33260100009102లో జమ చేయగలరని ఆయన కోరారు.

ఇంటర్మీడియట్ బాధిత కుటుంబాలను అదుకోవడం కోసమే అఖిలపక్షం పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ఉద్యమాలను అణచడం, ప్రశ్నించే గొంతుకలను నొక్కడం కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. సొసైటీ అకౌంట్ కు విరాళాలు ఇస్తే బాధిత కుటుంబాలను ఆదుకోవచ్చని ఆయన అన్నారు.

Latest Updates