మాస్కు కట్టుకోలేదని అడిగినందుకు పిడిగుద్దులు

మాస్కు కట్టుకోలేదని అడిగినందుకు పిడిగుద్దులు

ముంబై: కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతున్న నేపథ్యంలో మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి నియమాలను పాటించడం తప్పనిసరిగా మారింది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. అయినా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై సర్కార్‌లు జరిమానా విధిస్తుండటాన్ని చూస్తున్నాం. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ముంబైలో ఓ మహిళ మాస్కు కట్టుకోకపోవడంతో ఆమెను బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వర్కర్ అడ్డుకుంది. అయితే సదరు మహిళ ఆ వర్కర్‌‌పై చేయి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌‌లో వైరల్ అవుతోంది. 

కరోనా సేఫ్టీ రూల్స్‌‌లో భాగంగా మాస్కు ఎందుకు పెట్టుకోలేదని బీఎంసీ ఎంప్లాయ్ సదరు మహిళను ప్రశ్నించగా.. ఆమె ఆటోలో నుంచి దిగి ఉద్యోగి వైపుగా దూసుకొచ్చింది. మాస్క్ కట్టుకోనందుకు రూ.200 ఫైన్ కట్టమని మార్షల్ అడగడంతో వాగ్వివాదానికి దిగిన మహిళ.. గొడవ పెద్దది కావడంతో బీఎంసీ వర్కర్‌‌పై పిడుగుద్దులు కురిపించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని బీఎంసీ సూపర్‌‌వైజర్ ప్రశాంత్ కాంబ్లే తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్కులు కట్టుకోని వారికి ప్రభుత్వం రూ.200 ఫైన్ విధిస్తోంది.