తృణమూల్ MLA బిశ్వాస్ హత్య కేసు : BJP నేత ముకుల్ రాయ్ పై FIR

వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. బిశ్వాస్ హత్యలో తృణమూల్ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నేత ముకుల్ రాయ్ హస్తం ఉందని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. ఈ ఘటనలో టీఎంసీ నేతలంతా బీజేపీని టార్గెట్ చేశారు. వెస్ట్ బెంగాల్ మంత్రి  పార్థ చటర్జీ.. బిశ్వాస్ స్వగ్రామమైన నదియాకు వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.

తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను తప్పుపట్టారు ముకుల్ రాయ్. బెంగాల్ లో తృణమూల్ నేతలు, కార్యకర్తలు ఎవరు చనిపోయినా.. బీజేపీ నేతలే చేశారని ఆరోపించడం అలవాటుగా మారిపోయిందన్నారు. సత్యజిత్ హత్యపై ఇండిపెండెంట్ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.

శనివారం రాత్రి తన ఇంటి దగ్గర్లో ఓ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు అతి దగ్గరనుంచి కాల్పులు జరపడంతో కృష్ణగంజ్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ ప్రాణాలు కోల్పోయారు. చిన్నవయసులో ఎమ్మెల్యే అయినవారిలో ఆయన ఒకరు. సత్యజిత్ బిశ్వాస్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

FIR లో ముకుల్ రాయ్ పేరు

ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు.. ముకుల్ రాయ్ పేరును చేర్చారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుజిత్ మొండల్, కార్తిక్ మొండల్ అనే ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. అలాగే హన్స్ ఖలీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇంచార్జ్ అనిద్య బసును సస్పెండ్ చేశారు. హత్య జరిగిన రోజు సెలవులో ఉన్న ఎమ్మెల్యే సెక్యూరిటీ చీఫ్ ను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు పోలీసులు.

 

Latest Updates