ఢీల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

ఢిల్లీలోని అనాజ్ మండీలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాగులు, బాటిళ్లు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 43 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 25 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కకున్న దాదాపు 50 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. మంటలను దాదాపు 27 ఫైరింజన్లతో అదుపు చేస్తున్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను తరలించడానికి దాదాపు 15 అంబులెన్సులను ఉపయోగిస్తున్నారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న నాలుగు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి చుట్టు పక్కల దట్టంగా పొగ అలుముకుంది.

కాగా.. ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్కడికి చేరుకున్నారు. పోలీసులను అడిగి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేయవలసిందిగా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మోదీ, రాహుల్, అమిత్ షా ప్రమాదంపై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.