అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. చికాగో శివారులోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ఉన్మాది జరిపిన ఫైరింగ్ లో ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు అరోరా పారిశ్రామిక ప్రాంతంలో జరిగాయి. ఫైరింగ్ చేసిన వ్యక్తి 45 ఏళ్ల గ్యారీ మార్టిన్ గా గుర్తించారు. అక్కడే ఉన్న హెన్రీ పాట్ అనే కంపెనీలో ఇదివరకు పని చేసినట్లు చెబుతున్నారు. 20 ఏళ్లుగా మార్టిన్ అదే కంపెనీలో పని చేశాడని, 2 వారాల క్రితమే అతడి జాబ్ పోయిందని తెలిసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, ఆ కోపంతోనే కాల్పులు జరిపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇండస్ట్రియల్ ఏరియాలో జనం ఎక్కువున్న్ చోట గన్ తో ప్రవేశించిన గ్యారీ మార్టిన్… ఒక్కసారిగా ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. దీంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అరోరాలోని ఇండస్ట్రియల్ ఏరియాకు చేరుకుని చుట్టు ముట్టారు.

పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉన్మాది మార్టిన్ హతమయ్యాడు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఫైరింగ్ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఓ స్కూల్ ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. స్కూల్ లో పిల్లలకు రక్షణ కల్పించాలని స్కూల్  సిబ్బందికి పోలీసులు ఆదేశించారు. ఇండస్ట్రియల్ ఏరియా చుట్టూ తనిఖీలు ముమ్మరం చేశారు. ఫైరింగ్ జరిపింది ఒక్కరేనని, ఇంకెవరూ లేరని నిర్ధారించారు పోలీసులు. చికాగోకు 65 కిలోమీటర్ల దూరంలో అరోరాలో ఈ ఘటన జరిగింది. ఘటనను అరోరా మేయర్ ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలిపారు. అరోరాలో మరింత ప్రాణనష్టం నివారించిన పోలీసులను అభినందించారు.

Latest Updates