పామాయిల్ కోసం అడవికి అగ్గి

బోర్నియో అడవుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎగసిపడుతున్న మంటలే కనిపిస్తుంటాయి. మంటలంటే అడవులు యాక్సిడెంటల్ గా  అంటుకోవడంతో వచ్చిన మంటలు కావు. మనుషులు పెట్టిన మంటలు.అడవులను ఇలా తగలబెట్టడం వల్ల పర్యవసానాలు డేంజరస్ గా ఉంటాయి. అయినా ఇవి ఆగడం లేదు.

పామాయిల్ పంట ఇప్పుడు డాలర్లు కురిపిస్తోంది.ఈ పంటకు  ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పామాయిల్ పంట వేస్తే చాలు పర్సు కళకళలాడుతుంది. బ్యాంకు అక్కౌంట్ లో ఫుల్లుగా డబ్బులుంటాయి. సొమ్ముకు కొదవే ఉండదు. దీంతో ఇండోనేషియలోని బోర్నియో దీవిలో  పోటీలు పడి మరీ పామాయిల్ పంట వేస్తున్నారు. దీనికోసం అడవులను  ఎడాపెడా తగలబెట్టేస్తున్నారు. ముందు వెనకా ఆలోచించకుండా అడవులకు నిప్పంటిస్తున్నారు. పామాయిల్ ఎక్కడ పడితే అక్కడ పండదు. నేల చదునుగా ఉండాలి. ఎగుడుదిగుడుగా ఉండే నేల ఏమాత్రం పనికిరాదు. పంట సాగు చేయడం కోసం బోర్నియో అడవుల్లో అడ్డొచ్చిన చెట్లను ఎడాపెడా కొట్టేస్తున్నారు. కొట్టేయడం సాధ్యం కాదనుకుంటే ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఇలా అడవులకు అడవులనే తగలబెట్టడం వల్ల వచ్చే  నష్టాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

అడవులను తగలబెడితే…..

అడవులను తగలబెట్టడం అంటే మనిషి మనుగడను తగలబెట్టినట్టే. ఆ ప్రభావం అందరిపై  పడుతుంది.చెట్లు తగలబెట్టడం వల్ల వచ్చే గాలిని పీల్చడం వల్ల రోగ నిరోధక శక్తి  తగ్గుతుంది. ఫలితంగా మనిషి అనారోగ్యం పాలవుతుంటాడు. తరచూ  ఆస్పత్రిలో అడ్మిట్ కావలసిన పరిస్థితులు వస్తాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ఇండోనేషియా ఆకాశం ఎరుపెక్కింది. ఎందుకా అనుకున్నారు. సైంటిస్టులు కారణాలు వెతగ్గా వెతగ్గా దీనికి అడవుల్లో రేగిన కార్చిచ్చులే కారణమని తేలింది. ఈ కార్చిచ్చుల వల్ల పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్  వాతావరణంలోకి  రిలీజ్ అయినట్లు యూరోపియన్ యూనియన్ కు చెందిన సైంటిస్టులు చెప్పారు. వీటన్నిటి ఫలితంగా గాలి కాలుష్యం ఏర్పడింది. దీంతో 18 ఏళ్ల లోపు చిన్నారులు ఆరోగ్యపరంగా డేంజర్ జోన్ లో చిక్కుకున్నారు. ఇలా అనారోగ్యం బారిన పడ్డవారిలో నాలుగో వంతు మంది ఐదేళ్లలోపు చిన్నారులే ఉన్నారని యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ ‘యునిసెఫ్’ పేర్కొంది. తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు ఊపిరి రోగాలతో ఇబ్బందులు పడ్డారని పేర్కొంది.

మంటలను ఆర్పాలన్నా ఇబ్బందులే

బోర్నియో అడవుల్లో ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి  ఫైర్ ఇంజన్లు ఎంతగా కృషి చేస్తున్నా అవి పెద్దగా ఫలితాలనివ్వడం లేదు. మంటలు ఎక్కడో అడవుల మధ్యలో ఉంటాయి.అక్కడకు వెళ్లడం కూడా  ఫైర్ ఇంజన్లకు ఓ సమస్యగా మారింది. నీళ్ల కరువు మరో పెద్ద ప్రాబ్లం. కొన్ని సార్లు అడవి మధ్యలో అప్పటికప్పుడు బావులను తవ్వుకుని అలా వచ్చిన  నీళ్లను ట్యాంకుల్లో నింపుకుని మంటలు చెలరేగుతున్న ప్రాంతాల దగ్గరకు వెళ్తున్నారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. అడవుల్లో ఏయే ప్రాంతాల్లో నీళ్లు దొరుకుతాయో తెలుసుకోవడానికి రష్యా  హెలికాఫ్టర్  సాయాన్ని కూడా  ఫైర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటోంది.

రూల్స్ ను పక్కనపెట్టి…

పామాయిల్ పంట సాగుచేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫలానా ఏరియాల్లోనే ఈ పంటను  సాగు చేయాలంటాయి రూల్స్ . అయితే కొంతకాలంగా రైతులు  ఈ రూల్స్ ను పట్టించుకోవడం లేదు. ఎక్కడ కాస్తంత జాగా దొరికితే అక్కడ ఎడాపెడా పంట వేస్తున్నారు. ఇండోనేషియా లో ప్రస్తుతం సాగవుతున్న  పామాయిల్ ప్లాంటేషన్స్ లో 81 శాతం రూల్స్ కు తూట్లు పొడిచినవేనని సాక్షాత్తూ  ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ చెబుతోంది.అనేక చోట్ల ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి పామాయిల్ సాగు చేస్తున్నారని పేర్కొంది.

అనేక జీవరాశులకు నిలయం

బోర్నియో ఐలాండ్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అనేక జీవరాశులకు ఈ ఐలాండ్ నిలయం. 420 రకాల పక్షులు, 222 రకాల జంతువులు బోర్నియో ఐలాండ్ లో ఉన్నాయి. ఇవే కాదు ‘ఒరాంగుటాన్ ’ అనే ఒక కోతి  జాతి జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అడవులను విచ్చలవిడిగా కాల్చివేయడం వల్ల ఈ అన్ని  జీవరాశులు డేంజర్ జోన్ లో చిక్కుకున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ఇండోనేషియాకు బంగారంలా మారిన పామాయిల్

పదేళ్లుగా ఇండోనేషియాకు పామాయిల్ సాగు బంగారంలా మారింది. ఇండోనేషియా ఎగుమతుల్లో పామాయిల్ నెంబర్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ అవసరాల్లో సగానికి పైగా ఒక్క ఇండోనేషియానే తీరుస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పామాయిల్ కు ఆఫ్రికాతో పాటు ఆసియాలోని  అనేక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది.

ఆఫ్రికా నుంచి ఇండోనేషియాకు …

ప్రపంచ కాస్మెటిక్స్ మార్కెట్ ను ఊపేస్తోన్న  పామాయిల్ సాగు మొదట్లో ఆఫ్రికా లోనే ఉండేది. తరువాతి కాలంలో ఇండోనేషియా తో పాటు మలేషియాలోనూ  ఎంటరైంది. ఇండోనేషియా నేలల్లో పామాయిల్ పంట సిరులు కురిపించింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వచ్చేది. సోయా, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలంటే చాలా ఎక్కువ  ఏరియా కావాలి. పామాయిల్ ను చాలా తక్కువ ఏరియాలో తక్కువ టైంలో సాగు చేయవచ్చు. అదీకాక సొమ్ము కూడా బాగా వస్తుంది.

సాగు నిలిపివేస్తే సమస్య పరిష్కారమవుతుందా ?

అడవులను కాపాడుకోవడం కోసం పామాయిల్ సాగును కొంతకాలం పాటు నిషేధించడమే మంచిదన్న అభిప్రాయం కూడా కొన్ని సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇది కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల్లో పామాయిల్ వాటా 35 శాతం ఉంటుంది. కానీ మొత్తం భూమిలో పామాయిల్ సాగు చేసే  విస్తీర్ణం 10 శాతం మాత్రమే. మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు తగ్గట్టు పామాయిల్ కల్టివేషన్ జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇండోనేషియా ప్రజలు బోర్నియో ఐలాండ్ లో అడవులను ఎడాపెడా తగలబెట్టి పంట సాగు చేస్తున్నారు. పామాయిల్ సాగును పర్యావరణవేత్తలు వ్యతిరేకించడం లేదు. అయితే అడవులను తగలబెట్టడం మానేసి వేరే పద్ధతుల వైపు చూడాలని అంటున్నారు.

అడవులను కాల్చివేయడం లేదా నరికి వేయడం వల్ల మాత్రమే  పామాయిల్ సాగు సాధ్యమవుతుందని కోవడానికి వీల్లేదు. మిగతా పద్ధతులు  కూడా ఉన్నాయంటున్నారు  అగ్రికల్చర్  సైంటిస్టులు. అయితే వాటి పై  ప్రజలు పెద్దగా దృష్టి పెట్టడం లేదంటున్నారు. పర్యావరణం దెబ్బతినకుండా పామాయిల్ పంట సాగు చేయడంపై కొన్ని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పామాయిల్ పంటను సాగు చేసే రైతులు, వ్యాపారులు సభ్యులుగా ఉండే ’రౌండ్ టేబుల్ ఆన్ సస్టెయినబుల్ పామాయిల్’ (ఆర్ ఎస్ పీ ఓ) సంస్థ ఈ వైపుగా  కృషి చేస్తోంది. అయితే తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజల నుంచి ఆశించినంతగా సహకారం అందడం లేదని ఆర్ ఎస్ పీ ఓ అంటోంది. ఈ విషయంలో  ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు.

డేంజర్ జోన్ లో ‘ ఒరాంగుటాన్లు  ’

అడవులను  తగలబెట్టడం ఫలితంగా జెనెటిక్ పరంగా మనుషులకు దగ్గరగా ఉండే ఒరాంగుటాన్లు కూడా డేంజర్ జోన్ లో చిక్కుకున్నాయి.మంటల ఫలితంగా బోర్నియో దీవిలోని అటవీ ఏరియా తగ్గిపోతోంది. దీంతో ఒరాంగుటాన్లు మనుషులుండే మైదాన ప్రాంతాల్లోకి వెళుతున్నాయి. అక్కడ అవి పంటలపై పడటంతో  కొన్ని సార్లు వాటిని  జనం చంపేస్తుంటారు కూడా.

పామాయిల్ కు ఎందుకు అంత డిమాండ్ ?

ప్రపంచవ్యాప్తంగా అన్ని సూపర్ మార్కెట్లలో పామాయిల్ ప్రోడక్ట్స్ కు డిమాండ్ పెరిగింది. చాక్లెట్ నుంచి షాంపూల వరకు వాటి తయారీలో ఈ ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఆడవాళ్లు ఉపయోగించే లిప్ స్టిక్ వంటి సౌందర్య సాధనాల్లో పామాయిల్ వాడకం ఈమధ్య బాగా ఎక్కువైంది. గత  ఇరవై ఏళ్లుగా ఈ ట్రెండ్  పెరిగింది. ఇదొక్కటే కాదు పిజ్జాలు, కొన్ని రుచికరమైన బిస్కెట్ల తయారీలో కూడా పామాయిల్ ను వాడుతున్నారు. పెరుగుతున్న పామాయిల్ డిమాండ్ కు తగ్గట్టుగా పామాయిల్ పంటను సాగు చేయడానికి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ పంట వల్ల 0.4 శాతం అడవులు తగ్గిపోయాయి. ఇండోనేషియాలో పామాయిల్ సాగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాతి స్థానం మలేషియాది.ఈ రెండు దేశాల్లోని కొన్ని చోట్ల దాదాపు 50 శాతం అడవులు కేవలం పామాయిల్ సాగు చేసే పొలాలుగా  మారిపోయాయి. ఈ రెండు దేశాల్లో అత్యధికంగా ఏడాదికి లక్షల టన్నుల పామాయిల్ ను ఉత్పత్తి చేస్తున్నారు.

మూడో అతి పెద్ద ఐలాండ్ బోర్నియో

బోర్నియో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ద్వీపం. ఆసియా వరకు ఇదే అతి పెద్ద ద్వీపం. 2,87,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా కాలం ఈ ఐలాండ్ ప్రపంచానికి దూరంగా ఉండేది.ఎవరూ పట్టించుకోలేదు. మొదటిసారి 16వ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్ దేశస్తులు ఈ దీవికి చేరుకున్నారు. ఈ ద్వీపం చుట్టూ మూడు దేశాలు ఇండో నేషియా, మలేషియా, బ్రూనీ ఉంటాయి. అయితే బోర్నియో దీవిలో దాదాపు మూడొంతుల భాగం ఇండోనేషియా కంట్రోల్లోనే ఉంటుంది. దీంతో  చాలామంది బోర్నియో ఐలాండ్ ను ఇండోనేషియా లో భాగంగానే భావిస్తారు.

Latest Updates