కరోనా నయమైంది.. హాస్పిటల్ నుంచి పేషెంట్ డిశ్చార్జ్

థాయ్‌లాండ్‌లో కరోనా వైరస్ బారిన పడిన తొలి పేషెంట్‌ పూర్తిగా కోలుకున్నాడని ఆ దేశం ప్రకటించింది. ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడిన 50 ఏళ్ల టాక్సీ డ్రైవర్‌ని ఆస్పత్రి నుంచి డిశ్చార్ చేసి ఇంటికి పంపామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అనుటిన్ తెలిపారు. బమ్రాస్నరదురా ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్ అతడికి చికిత్స అందించినట్లు చెప్పారు.

థాయ్‌లాండ్‌లో మొత్తం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. టాక్సీ డ్రైవర్‌గా పని చేసే 50 ఏళ్ల వృద్ధుడు తొలి పేషెంట్. చైనా నుంచి వచ్చిన టూరిస్టులను తన టాక్సీలో ఎక్కించుకోవడం వల్ల వారి నుంచి అతడికి కరోనా వైరస్ సోకింది. తొలుత బ్యాంకాక్‌లోని టక్సిన్ హాస్పిటల్‌లో చేరిన అతడిని జనవరి 28న బమ్రాస్నరదురా ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందించిన డాక్టర్లు..  అతడికి కరోనా సింప్టమ్స్ పూర్తిగా నయమయ్యాయని తేల్చారు.

కరోనా క్యూర్ కావడంతో టాక్సీ డ్రైవర్‌ను బుధవారం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అనుటిన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. కరోనా సోకిన మిగతా పేషెంట్లు కూడా వేగంగా కోలుకుంటున్నారని, వారిని కూడా త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

మంగళవారం చైనాలోని వుహాన్ సిటీ నుంచి 138 మంది థాయ్‌లాండ్ ప్రజలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చామని చెప్పారు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ సత్‌హిత్. వారిలో ఆరుగురికి తీవ్రమైన జ్వరం ఉండడంతో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.

సింగపూర్‌లోనూ ఒకరు డిశ్చార్జ్

సింగపూర్‌లోనూ ఒక కరోనా పేషెంట్‌కు పూర్తిగా నయమైందని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. చైనా నుంచి వచ్చి ఓ టూరిస్టు జనవరి 27న కరోనాతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని, నేషనల్ సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (NCID)లో చికిత్స అందించామని తెలిపారు. HIV పేషెంట్లకు వాడే లోపినవిర్, రిటోనవిర్ మందులను కరోనా బాధితులకు ఇస్తున్నట్లు ఆరోగ్య శాఖ చీఫ్ హెల్త్ సైంటిస్ట్ టాన్ చౌన్ తెలిపారు.

కాగా,  చైనాలో ఇప్పటికే 28 వేల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వారిలో 560 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest Updates