మిస్ టీన్ ఇంటర్నేషనల్ గెలిచిన తొలి ఇండియన్

ఢిల్లీలో జరిగిన ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’ టైటిల్ భారత్ వశమయింది. భారత్ తరపున పోటీలో పాల్గొన్న ఆయుషి ధోలాకియా ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ టైటిల్ కిరీట ప్రదానం నిన్న ఢిల్లీలో జరిగింది. డిసెంబర్ 13 నుంచి 19 వరకు ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో 22 దేశాల యువతులు పాల్గొన్నారు. వారందరిని కాదని వడోదరకు చెందిన ఆయుషి ఈ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’అవార్డును ప్రవేశపెట్టిన 27 సంవత్సరాలలో తొలిసారిగా ఈ టైటిల్ భారత్‌కి వచ్చింది. అంతేకాకుండా ఈ టైటిల్ అందుకున్న తొలి ఏషియన్ మహిళగా ఆయుషి నిలిచింది. సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జైపూర్‌లోని జియా బాగ్ ప్యాలెస్‌లో జరిగిన దేశవాలీ పోటీలలో 31 మంది పోటీదారులను ఓడించిన ఆయుషి, ఆ తర్వాత భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది.

టైటిల్ గెలవడంపై స్పందించిన ఆయుషి.. ‘నేను దేశవాలి ఆడిషన్‌కు వచ్చినప్పుడు ఏ విషయాలు నాకు తెలియవు. అప్పుడు ర్యాంపు వాక్ ఉంటుందని మాత్రమే నాకు తెలుసు. కానీ, జాతీయ స్థాయిలోకి ప్రవేశించినప్పుడు నేను కొంత శిక్షణ పొందాను. ర్యాంప్ వాక్ గురించి, జడ్జీలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలన్న విషయం గురించి, మరియు బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాను. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆయుషి తెలిపింది.

Latest Updates