ఫస్ట్​ రెండు కరోనా టెస్టులు ఫ్రీ

ప్రజలందరికీ ఫస్ట్​ రెండు టెస్టులు ఉచితమన్న కేంద్రం
ఇటలీ, ఇరాన్​లో చిక్కుకున్నోళ్లు ఇండియాకు
దేశంలో 107కు చేరిన కరోనా కేసులు

కరోనా టెస్టులను ఫ్రీగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి రెండు కన్ఫర్మేషన్​ టెస్టులను పౌరులందరికీ ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ విషయాన్ని ప్రకటించారు. టెస్టులు చేయడానికి దేశంలో పూర్తిస్థాయి మౌలిక వసతులున్నాయని, కానీ, ఇప్పటిదాకా రోజూ 10 శాతానికి మించి అవసరం పడట్లేదని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 107కి చేరింది. 31 కేసులతో మహారాష్ట్ర టాప్​లో ఉంది. తర్వాత 22 కేసులతో కేరళ రెండో స్థానంలో నిలిచింది. ఎయిమ్స్​ 24/7 హెల్ప్​లైన్​ నంబర్​ 9971876591ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 13 దాకా 703 షిప్పులు, అందులోని 25,504 మంది సిబ్బందిని తీరం నుంచే వెనక్కు పంపించేశామని కేంద్ర షిప్పింగ్​ శాఖ ప్రకటించింది. దేశ, విదేశాలకు గ్రూప్​ టూర్లను నిషేధిస్తూ ముంబై పోలీసులు  144 సెక్షన్​ను విధించారు. టూర్​ ఆపరేటర్లు ఎవరైనా దానిని అతిక్రమిస్తే క్రిమినల్​ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్తార్​పూర్​ కారిడార్​ టూర్​ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్థాన్​ ఇంటర్నేషనల్​ బోర్డర్​ నుంచి అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. కరోనా బాధితుడి వివరాలను బయటపెట్టినందుకు జమ్మూ కాశ్మీర్​ డాక్టర్​ను సస్పెండ్​ చేశారు. ఢిల్లీలో తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి అతడిని డిశ్చార్జ్​ చేశారు.

ఇటలీ, ఇరాన్ నుంచి తీసుకొచ్చిన్రు

ఇటలీ ఎయిర్​పోర్టులో చిక్కుకుని గోస తీస్తున్న ఇండియన్లు ఎట్టకేలకు దేశానికి తిరిగొచ్చేశారు. 211 మంది స్టూడెంట్లు సహా 218 మందిని మిలాన్​ నుంచి రక్షించి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​లో ఎయిరిండియా ప్రత్యేక విమానం ల్యాండ్​ అయినట్టు విదేశాంగ శౄఖ సహాయ మంత్రి వి. మురళీధరన్​ తెలిపారు. అందరినీ ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ క్వారెంటైన్​కు తరలించారు. ఇటు ఇరాన్​లో చిక్కుకున్న వారినీ ఇండియాకు తీసుకొచ్చారు. మూడో బ్యాచ్​లో 234 మందిని రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో రాజస్థాన్​లోని జైసల్మీర్​కు తీసుకొచ్చామని, అందులో 131 మంది స్టూడెంట్లు కాగా, 103 మంది భక్తులున్నారని విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్​ తెలిపారు. అందరినీ అక్కడి ఇండియన్​ ఆర్మీ వెల్​నెస్​ సెంటర్​లో క్వారెంటైన్​కు పంపారు. బ్రిటన్​కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ రావడంతో విమానంలోని 289 మందినీ దించేశారు.  మొన్నటిదాకా మున్నార్​లోని ఓ హోటల్​ క్వారెంటైన్​లో ఉన్న అతడు, అతడి భార్య, అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఎలాగోలా వాళ్ల ఆచూకీని పట్టేసి కొచ్చి ఎయిర్​పోర్టులో పట్టుకున్నారు. దుబాయ్​ వెళ్లేందుకు ఎమిరేట్స్​ ఫ్లైట్​ ఎక్కిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ప్రయాణికులనూ కరోనా ముప్పుతో అందరినీ క్వారెంటైన్​కు పంపారు.

 

Latest Updates