ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఆర్థిక లోటు: డీకే అరుణ

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాలరీలను కట్ చేయడంపై స్పందించారు బీజేపీ నేత డీకే అరుణ. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని వేల కోట్లు అయినా  ఖర్చు పెడుతానన్నసీఎం కేసీఆర్… ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన IR,PRC ఇవ్వకుండా జీతాల్లో 50 శాతం కోత విధించడం సరైంది కాదన్నారు.

లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని స్వయంగా ప్రధాన మంత్రి మోడీ చెప్పారన్నారు. నెల జీతంపై ఆధారపడి బతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి ఆర్ధిక పరిస్థితి రావడానికి మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు డీకే అరుణ.

అంతేకాదు..కరోనా పై ప్రతి రోజు పోరాడుతున్న ఉద్యోగులకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు.ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు ఆర్థిక లోటు అనటం విడ్డురంగా ఉందన్నారు. కేవలం వారం రోజులు లిక్కర్ షాపులు బంద్ చేస్తే రాష్ట్రంలో ఆర్థిక లోటు వచ్చిందా అని ప్రశ్నించారు. వారం రోజుల లాక్ డౌన్ కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా…ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు..మరి వాటిని ఎలా  ఎదుర్కొంటారన్నారు.

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడి ఆర్టికల్ 360 అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు అవకాశం ఉటుందన్న డీకే అరుణ… ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలోనే లేదు కదా అన్నారు. వెంటనే ఉద్యోగుల వేతనాల కోతను సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అంతేకాదు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పై కేసీఆర్ నాలుగైదు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

Latest Updates